కలం, స్పోర్ట్స్: ఫిఫా వరల్డ్ కప్ 2026 రౌండ్ ఆఫ్ 32లో పోర్చుగల్, క్రొయేషియా (Croatia) మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ చివరి క్షణంలో క్రొయేషియా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. అభిమానులు కూడా సమం చేసిన గోల్‌గా ఆనందించారు. కానీ కొద్దిసేపటికే VAR ఆ ఆనందాన్ని ఆపేసింది. చివరికి అధికారిక మ్యాచ్ బాల్‌లోని సెన్సార్ గుర్తించిన చిన్న టచ్‌నే ఆ గోల్ రద్దుకు కారణమైంది.
సెకండ్ హాఫ్ ప్రారంభమైన వెంటనే ఇవాన్ పెరిసిచ్ క్రొయేషియాకు (Croatia) తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత క్రిస్టియానో రొనాల్డో టోర్నీలో తన మూడో గోల్‌తో పోర్చుగల్‌కు సమం చేశాడు. ఆట చివరి అదనపు సమయంలో రఫాయెల్ లియావో ఇచ్చిన క్రాస్‌ను గొన్‌సాలో రామోస్ హెడ్డర్‌తో గోల్‌గా మలిచి పోర్చుగల్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అయినా క్రొయేషియా (Croatia) వెనక్కి తగ్గలేదు. 103వ నిమిషంలో పెరిసిచ్ ఇచ్చిన క్రాస్‌ను మారియో పశాలిచ్ అందుకుని జోష్కో గ్వార్డియోల్‌కు అందించాడు.
గ్వార్డియోల్ బంతిని గోల్‌లోకి పంపడంతో మ్యాచ్ మళ్లీ సమమైందని అందరూ భావించారు. అయితే VAR వెంటనే రంగంలోకి దిగింది. రివ్యూలో బంతి పశాలిచ్‌కు చేరే ముందు క్రొయేషియా ఆటగాడు ఇగోర్ మాటానోవిచ్ తలకు స్వల్పంగా తాకినట్లు తేలింది. ఆ క్షణంలోనే పశాలిచ్ ఆఫ్‌సైడ్‌లో ఉండటంతో గోల్‌ను రద్దు చేశారు. ఈ నిర్ణయంపై తర్వాత ఫిఫా వివరణ ఇచ్చింది. అధికారిక మ్యాచ్ బాల్‌లో అమర్చిన కనెక్టెడ్ బాల్ టెక్నాలజీ, అందులోని IMU సెన్సార్ మాటానోవిచ్ చేసిన ఆ స్వల్ప టచ్‌ను స్పష్టంగా గుర్తించిందని తెలిపింది. అదే సమాచారం ఆధారంగా రిఫరీ సరైన ఆఫ్‌సైడ్ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించింది. ఒక్క చిన్న టచ్, ఒక్క సెన్సార్ సిగ్నల్, ఒక్క VAR నిర్ణయం… చివరికి క్రొయేషియా ఆశలు చిద్రమయ్యాయి. రొనాల్డో సమం చేసిన గోల్, రామోస్ చివరి నిమిషం గోల్‌తో పోర్చుగల్ విజయాన్ని సొంతం చేసుకుంది.

