కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam ) జిల్లా అటవీశాఖాధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ నేతృత్వంలో వాసవిక్ సేవా ఫౌండేషన్ సహకారంతో “వనజీవి రామయ్య” చిత్ర బృందాన్ని గౌరవిస్తూ ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి సర్కిల్ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డాక్టర్ డి. భీమా నాయక్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య తన జీవితాన్ని నిస్వార్థంగా ప్రకృతి రక్షణకు అంకితం చేశారని, ఇది ఖమ్మం జిల్లాకే కాక తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని కొనియాడారు. ఆయన పర్యావరణ ప్రస్థానంలో కుటుంబ సభ్యుల సహకారం అభినందనీయమన్నారు. ముఖ్యంగా తాను పెంచిన విలువైన ఎర్రచందనం చెట్లను ప్రభుత్వానికి అప్పగించడం ద్వారా రామయ్య తనకు ప్రజా శ్రేయస్సు పట్ల ఉన్న నిబద్ధతను చాటుకున్నారని గుర్తుచేశారు.
గౌరవ అతిథిగా విచ్చేసిన ఖమ్మం మేయర్ పూనుకొల్లు నీరజ మాట్లాడుతూ.. రామయ్య విజయంలో ఆయన భార్య శ్రీమతి జానకమ్మ కృషి మరువలేనిదన్నారు. జానకమ్మ కు పెన్షన్ సౌకర్యం కల్పించే విషయంపై జిల్లా కలెక్టర్‌తో చర్చిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా అటవీ శాఖాధికారి శ్రీ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ.. గత ఆరు నెలలుగా ఖమ్మంలోని వెలుగుమట్ల అర్బన్ పార్క్,వికారాబాద్ అటవీ ప్రాంతాల్లో షూటింగ్ కోసం అటవీ శాఖ తరపున పూర్తి సహకారం అందించామన్నారు. ప్రస్తుత, భవిష్యత్ తరాలు రామయ్య జీవితం నుండి స్ఫూర్తి పొంది మొక్కలు నాటడం, వన్యప్రాణులను రక్షించడాన్ని బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సినిమా ముహూర్తపు షాట్ ఫోటోను డీఎఫ్ఓ కు జ్ఞాపికగా అందజేశారు. అనంతరం గద్దర్ అవార్డు – 2025, ఉత్తమ షార్ట్ ఫిలిం విభాగంలో అవార్డు గెలుచుకున్న సందర్భంగా చిత్ర బృందాన్ని సత్కరించారు.ఈ కార్యక్రమంలో దర్శకుడు,నంది అవార్డు గ్రహీత వేముగంటి, నిర్మాతలు నిడిగొండ నరేష్ కుమార్, లింగంపల్లి చంద్రశేఖర్, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ (వనజీవి రామయ్య పాత్రధారి), నటి నాగరాణి (జనకమ్మ పాత్రధారి), సంగీత దర్శకుడు బల్లేపల్లి మోహన్ ఛాయాగ్రాహకుడు తోట వి.రమణ తదితరులు పాల్గొన్నారు.

