కలం, ఖమ్మం బ్యూరో: రైతుల అభివృద్ధే లక్ష్యంగా సాగునీటి వనరుల విస్తరణకు కట్టుబడి ఉన్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. గురువారం ఆయన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామంలో రూ.36 కోట్ల 50 లక్షల వ్యయంతో 4,200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే కట్టలేరు ఆనకట్ట, కాలువల ఆధునీకరణ పనులకు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఈ ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని చివరి రైతుకు కూడా నీరు అందించేందుకు కట్టలేరు ప్రాజెక్టు ఆధునీకరణ పనులు చేపట్టినట్లు తెలిపారు.
నదులను వినియోగించుకోలేకపోయాం
కట్టలేరు, వైరా నది, మున్నేరు మూడు నదుల నీటి ప్రవాహాలు ఉన్నప్పటికీ వాటిని సక్రమంగా వినియోగించలేకపోయామని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పైనే దృష్టి పెట్టి ఈ ప్రాంత సమస్యలను పట్టించు కోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కట్టలేరు కాలువల లైనింగ్ పనులకు రూ.36.50 కోట్లు మంజూరు చేసి చివరి రైతు వరకు నీరు చేరేలా చర్యలు చేపట్టామన్నారు. ఎర్రుపాలెం ప్రాంతంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రింద కూడా సాగు ఉన్నప్పటికీ జోన్-3లో నీరు సరిగ్గా అందడం లేదని, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదించినా గత ప్రభుత్వం దానిని నిర్లక్ష్యం చేసిందన్నారు. సీతారామ ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల ప్రాంతం నష్టపోయిందని తెలిపారు. జవహార్ లింక్ కాలువతో గోదావరి నీటిని ఎన్ఎస్పీతో అనుసంధానం చేసామని చెప్పారు.
నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం
నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం కాలువల ఆధునీకరణను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. వ్యవసాయ అభివృద్ధితో పాటు పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయడంతో పాటు డైట్ ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. ఎర్రుపాలెంను మోడల్ మండలంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాబోయే జూన్ 2 నుంచి రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు ఇందిరమ్మ భీమా అమలు చేస్తామని, ఫైన్ రైస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. టెక్నికల్ విద్యను అభివృద్ధి చేయడంతో పాటు ఏటీసీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్, పాలు, జావ అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర హస్తకళాల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, ఇర్రిగేషన్ ఎస్ఇ వాసంతి, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

