ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే దూకుడు
ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే వైభవ్ (Vaibhav Suryavanshi) దూకుడు చూపించాడు. కేవలం 55 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. ఇది అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో భారత ఆటగాడు నమోదు చేసిన వేగవంతమైన సెంచరీగా నిలిచింది. ఆ తర్వాత మరింత వేగం పెంచాడు. 80 బంతుల్లో 175 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా రికార్డు అయ్యింది. 26వ ఓవర్‌లో భారత్ స్కోరు 250 దాటిన దశలో వైభవ్ ఔటయ్యాడు. అప్పటికే మ్యాచ్‌పై భారత్ పట్టు సాధించింది. అతడి ఇన్నింగ్స్‌తో భారీ స్కోరు దిశగా జట్టు దూసుకెళ్లింది.
పాత రికార్డులు బద్దలు
ఈ ప్రదర్శనతో గతంలో ఉన్ముక్త్ చంద్ చేసిన 111 నాటౌట్ రికార్డు చెరిగిపోయింది. టోర్నమెంట్‌లో భారత ఆటగాడిగా రాజ్ బావా చేసిన 162 నాటౌట్ రికార్డును కూడా వైభవ్ అధిగమించాడు. ఈ వరల్డ్ కప్ మొత్తం వైభవ్ స్థిరంగా రాణించాడు. మొత్తం 439 పరుగులు చేశాడు.ఒకే ఎడిషన్‌లో భారత ఆటగాళ్లలో రెండో అత్యధిక స్కోర్ ఇది. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్, ఉదయ్ సహరన్, శుభ్మన్ గిల్‌ల రికార్డులు వెనక్కి వెళ్లాయి. 2004లో శిఖర్ ధావన్ చేసిన 505 పరుగులే ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నాయి. ఫైనల్‌లో చేసిన ఈ ఇన్నింగ్స్‌తో భారత్ ఆరో అండర్-19 వరల్డ్ కప్ టైటిల్ దిశగా ముందడుగు వేసింది. వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పటికే ఈ టోర్నమెంట్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది. మిగతా మ్యాచ్ ఫలితం ఏదైనా కావొచ్చు. కానీ ఈ ఫైనల్ ఇన్నింగ్స్ భారత క్రికెట్ యువ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టంగా గుర్తుండిపోతుంది.
Read Also: 17వ అంతస్థు నుంచి దూకి ముల్తానీ బేకరీ ఓనర్ సూసైడ్
Follow Us On : WhatsApp


