Mobile Popup Ad
Mobile Popup Ad

సూపర్ ఓవర్ డ్రామా.. శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ వాగ్వాదం

కలం, స్పోర్ట్స్ : దంబుల్లాలో సూపర్ ఓవర్ థ్రిల్లర్ ముగిసిన వెంటనే ఉద్రిక్తత చోటుచేసుకుంది. శ్రీలంక-ఏ చేతిలో భారత్-ఏ ఓడిపోయిన తర్వాత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ప్రత్యర్థి ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు మ్యాచ్ ముగిసిన వెంటనే కనిపించాయి. త్రైపాక్షిక వన్డే సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఇరు జట్లు 50 ఓవర్లలో 265 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. దీంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించారు.

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్-ఏ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. సూర్యాన్ష్ షెడ్గే 66 బంతుల్లో 72 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. విప్రాజ్ నిగమ్ 49 బంతుల్లో 51 పరుగులు చేశాడు. లక్ష్య ఛేదనలో శ్రీలంక-ఏ కూడా 265 పరుగులకే పరిమితమైంది. సదీర సమరవిక్రమ 113 బంతుల్లో 93 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. సూపర్ ఓవర్‌లో శ్రీలంక-ఏ 18 పరుగులు చేసి భారత్-ఏ ముందు 19 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

అయితే భారత జట్టు ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. చివరి బంతికి ఎనిమిది పరుగులు అవసరమైన సమయంలో శ్రీలంక బౌలర్ కుగతాస్ మతులన్ అద్భుత యార్కర్ వేశాడు. ఆ బంతిని వైభవ్ ఆడలేకపోయాడు. దీంతో భారత్-ఏ సూపర్ ఓవర్‌లో కేవలం తొమ్మిది పరుగులే చేసి ఓటమి చవిచూసింది. విజయం ఖరారైన వెంటనే శ్రీలంక ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఆ సమయంలో నిరాశకు గురైన వైభవ్, ప్రత్యర్థి జట్టులోని ఓ ఆటగాడితో మాటామాటా పడినట్లు కనిపించింది.

పరిస్థితి మరింత వేడెక్కకుండా భారత్-ఏ ఆటగాడు సూర్యాన్ష్ షెడ్గే జోక్యం చేసుకుని వైభవ్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లాడు. అయినప్పటికీ కొద్దిసేపు వాగ్వాదం కొనసాగినట్లు కనిపించింది. ఆ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు సంప్రదాయబద్ధంగా పరస్పరం అభినందనలు తెలుపుకుని మైదానం వీడారు. అయితే ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ కంటే చివర్లో జరిగిన ఈ ఘటనే ఎక్కువ చర్చకు దారి తీసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>