కలం, నల్లగొండ : కంచనపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని రాష్ట్ర రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkatreddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి, సాగునీరు, విద్యుత్, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గ పనులను పూర్తి చేసి, నల్లగొండ జిల్లాలో రెండు పంటలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తానని మంత్రి స్పష్టం చేశారు.
ఎస్ఎల్బీసీ ద్వారా జిల్లాను ధాన్య భాండాగారంగా మార్చడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును వేగవంతం చేసి, ఆయకట్టు పరిధిలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించి రైతుల కష్టాలను తీరుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కంచనపల్లి గ్రామాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. రైతులకు, గ్రామీణులకు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు రూ.3 కోట్ల వ్యయంతో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో దోమలపల్లిలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ‘నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది నల్లగొండ నియోజకవర్గ ప్రజలే. వారి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. రాబోయే మూడు సంవత్సరాలు నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధిపైనే నా ప్రత్యేక దృష్టి ఉంటుంది.’ అని మంత్రి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేందుకు వారానికి రెండు రోజులు నియోజకవర్గంలోనే గడుపుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

