కలం, వెబ్ డెస్క్: రష్యా రాజధాని మాస్కో (Moscow) పేలుడుతో దద్దరిల్లింది. కుద్రిన్స్కాయా స్క్వేర్లోని ఓ రెస్టారెంట్లో జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు మరణించగా.. 21 మందికి పైగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. యాంటీ టెర్రరిజం టీం ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిందని రష్యా ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
రెస్టారెంట్లోకి ఓ అనుమానాస్పద మహిళ వెళ్తుండటాన్ని అధికారులు గుర్తించారు. ఆమెను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. గేటు వద్దనే ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఆమెతో పాటు సెక్యూరిటీ గార్డ్, మరో వ్యక్తి చనిపోయారు. దీంతో ఎవరా మహిళ.. ఎందుకు దాడికి పాల్పడింది.. దీని వెనుక ఉక్రెయిన్ హస్తం ఏమైనా ఉందా.. లేకపోతే ఉగ్రవాదుల పనా.. అనేది దర్యాప్తు చేస్తున్నారు.

