కలం, వెబ్ డెస్క్: గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్, భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) వీరవిహారం చేశాడు. ఈ మ్యాచ్‌లో తన మునుపటి ఫామ్‌ను కొనసాగిస్తూ బౌండరీల వర్షం కురిపించిన వైభవ్.. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఏకంగా 1000 పరుగుల మార్క్‌ను దాటేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ఒక సీజన్‌లో నాలుగు అంకెల (1000 రన్స్) మైలురాయిని అందుకున్న మొట్టమొదటి బ్యాటర్‌గా నిలిచి, ఈ బుడ్డోడు సరికొత్త ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. గుజరాత్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 47 బంతుల్లో 96 పరుగులు చేశాడు.
ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ ఇంతకాలం ‘కింగ్’ విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన కోహ్లీ.. 2016 సీజన్‌లో 4 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలతో 81.08 సగటుతో ఏకంగా 973 పరుగులు సాధించాడు. ఆ తర్వాత ఏ బ్యాటర్ కూడా ఆ రికార్డుకు దరిదాపుల్లోకి రాలేకపోయారు. కాగా ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ 1000 మార్కును తాకడమే కాకుండా, కోహ్లీ ఎనిమిదేళ్ల నాటి అజేయ రికార్డును పూర్తిగా తునాతునకలు చేశాడు.
ఈ క్రమంలో ఐపీఎల్ సింగిల్ సీజన్ ఆల్‌టైమ్ టాప్-5 స్కోరర్ల జాబితా తలకిందులైంది. తాజా రికార్డుతో వైభవ్ అగ్రస్థానానికి చేరగా.. విరాట్ కోహ్లీ (973 రన్స్ – 2016) రెండో స్థానానికి పరిమితమయ్యాడు. వీరి తర్వాత గుజరాత్ టైటాన్స్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ (890 రన్స్ – 2023) మూడో స్థానంలో, రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ జోస్ బట్లర్ (863 రన్స్ – 2022) నాల్గో స్థానంలో, అలాగే డేవిడ్ వార్నర్ (848 రన్స్ – 2016) ఐదో స్థానంలో నిలిచారు. కేన్ విలియమ్సన్ (735 రన్స్ – 2018) టాప్-5 రేసు నుండి వెనక్కి నెట్టబడ్డాడు. వైభవ్ సృష్టించిన ఈ ఊహించని సంచలనంపై ఇప్పుడు క్రికెట్ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపిస్తోంది.

