కలం, వెబ్ డెస్క్: తెలంగాణ పోలీస్ శాఖలో మూడు కొత్త విభాగాలు ఏర్పాటు కాబోతున్నాయి. తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ సేఫ్టీ బ్యూరో, తెలంగాణ యాంటీ డ్రగ్, సేఫ్టీ క్లబ్స్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల కోసం డీజీపీ సీవీ.ఆనంద్ (DGP CV Anand) సుదీర్ఘంగా కసరత్తు చేశారు. డీజీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, ఐటీ నిపుణులు పాల్గొన్నారు. ఈ మూడు విభాగాలు ఎలా పనిచేయాలి, సిబ్బంది సంఖ్య ఎలా కేటాయించడంతో పాటు జారీ చేయాల్సిన జీవోలపై చర్చించారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఎస్ఐబీ, సెక్యూరిటీ వింగ్స్ నుంచి కొంతమంది సిబ్బందిని ఈ మూడు విభాగాలకు కేటాయించడంపైనా సమాలోచనలు జరిపారు.
ఆహార కల్తీ కోసం కొత్త విభాగం..
రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆహార కల్తీని అరికట్టేందుకు ప్రత్యేక ఆహార కల్తీ నిరోధక విభాగం ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు డీజీపీ సీవీ.ఆనంద్ తెలిపారు. తద్వారా, ఆహార కల్తీకి పాల్పడేవారిపై మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. వాస్తవానికి ఆహార కల్తీ విభాగాన్ని ఫుడ్ సేఫ్టీ విభాగమే నిర్వహిస్తుండగా.. పోలీస్ శాఖ కూడా జతకడితే బాగుంటుందనే ఆలోచన ఎప్పటినుంచో ఉంది. త్వరలోనే ఈ నిర్ణయం కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.

