కలం, ఖమ్మం బ్యూరో : ఏళ్లుగా బంగాళా ఖాతం పాలవుతున్న మున్నేరు వరద జలాలను ఒడిసిపట్టి లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేసేందుకు ప్రజా ప్రభుత్వం నడుంబిగించింది. మున్నేరు నుంచి పాలేరుకు గ్రావిటీ ద్వారా నీటిని మళ్లించి బంగారు పంటలు పండించేందుకు వీలుగా కాలువకు రూపకల్పన చేసింది. 4,500 క్యూసెక్కుల నీటి సరఫరా సామర్థ్యంతో నిర్మించనున్న కాలువ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదులాపురం వద్ద ఆదివారం శంకుస్థాపన చేశారు.
ప్రాజెక్ట్ ఆలోచనకు మూలం
వరంగల్ జిల్లా పాకాల చెరువు వరదతో ఏర్పడే మున్నేరు నది ఖమ్మం(Khammam) జిల్లాలోని ఖమ్మం రూరల్, చింతకాని మండలాల మీదుగా ప్రవహించి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించి ఎన్టీఆర్ జిల్లా మున్నలూరు వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద ఆకేరు, బుగ్గ వాగు మున్నేరులో కలుస్తాయి. ఈ రెండు వాగుల కలయికతో మున్నేరులో ప్రతి ఏటా వానా కాలంలో ప్రవాహం భారీగా ఉంటుంది. దీంతో తరచూ వరదలతో ఖమ్మం నగరంలోని శివారు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. మున్నేరు నుంచి ఏటా సుమారు 50 నుంచి 60 టీఎంసీలు కృష్ణా నదిలో కలిసి వృథాగా సముద్రం పాలవుతున్నాయి. ఈ నీటిని నాగార్జున సాగర్ ఆయకట్టుకు, పాలేరు ఎగువన ఉన్న ఆయకట్టుకు మళ్లించి దానిని స్థిరీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఆ సంకల్పంలో నుంచి పురుడు పుసుకున్నదే మున్నేరు-పాలేరు లింక్ కెనాల్(Munneru Palair link canal). మున్నేరు పాలేరు లింక్ కెనాల్ పూర్తయితే ఖమ్మం, సూర్యాపేట(Suryapet), మహబూబాబాద్ జిల్లాలో 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు ఆ జిల్లాల ప్రజలకు దాహార్తి తీరనుంది.


