కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని తప్పకుండా కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొనుగోలు చేసిన 9,214 వేల మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని సత్వరమే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల తాజా పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ రామకృష్ణా రావు, అన్ని జిల్లాల కలెక్టర్లు, రవాణా, పౌరసరఫరాల అధికారులతో అత్యవసరంగా వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష చేశారు.
దేశ చరిత్రలోనే రికార్డ్..
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రికార్డ్ స్థాయిలో ఒక సీజన్‌లో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేయాలని నిర్ణయించుకుందన్నారు. ఇప్పటి వరకు 66.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తీసుకున్నట్లు తెలిపారు. దీనిలో 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి, రూ.10,097 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. దీని వలన 8.15 లక్షల మంది రైతులకు లబ్ది కలుగుతుందన్నారు. కొనుగోలు చేసిన 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 44.67 లక్షల మెట్రిక్ టన్నులు సాధారణ రకం, 12.33 లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకం ధాన్యం అని వివరించారు.
ఇసుక లారీలు కొనుగోలు కేంద్రాలకు..
ఇసుక సరఫరా చేసే లారీలను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మళ్లించి, సత్వరమే ధాన్యాన్ని మిల్లులకు రవాణ చేసేందుకు వినియోగిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 8,575 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి.. రికార్డ్ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తుంటే.. రాజకీయాల కోసం ప్రతిపక్షాలు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను రాద్ధాంతం చేసి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. కొనుగోళ్ల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ, ఎక్కడ ఆటంకాలు రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు.

