కలం, వెబ్ డెస్క్: ఇరాన్ (Iran)తో యుద్ధం జరుగుతున్న వేళ అమెరికా ఆర్మీ చీఫ్ (US Army Chief) రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) ఆదేశాల మేరకు ఆర్మీ చీఫ్ రాండీ జార్జ్ (Randy George) తన పదవికి రాజీనామా చేశారు. సాధారణంగా ఆర్మీ చీఫ్‌కు నాలుగేళ్ల పదవీకాలం ఉంటుంది. 2023లో జో బైడెన్ హయాంలో రాండీ జార్జ్ యూఎస్ ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు. ఆయన గడువు ముగియకముందే పదవి నుంచి తప్పుకోవడం సంచలనంగా మారింది. ఆయన స్థానంలో ఆర్మీ వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ క్రిస్టోఫర్ లానీవ్‌ను తాత్కాలిక ఆర్మీ చీఫ్‌గా నియమిస్తున్నట్లు పెంటగాన్ అధికార ప్రతినిధి షాన్ పార్నెల్ ప్రకటించారు.
దశాబ్దాల కాలంగా సైన్యంలో విశేష సేవలందించిన జార్జ్ రాజీనామాకు ఖచ్చితమైన కారణాలు వెల్లడి కాలేదు, అయితే సైన్యంలో నాయకత్వ మార్పు అవసరమని రక్షణ శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పెంటగాన్‌లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హెగ్సెత్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఇప్పటి వరకు నౌకాదళం, వాయుసేనలకు చెందిన దాదాపు డజను మందికి పైగా సీనియర్ అధికారులను పదవుల నుండి తొలగించడం గమనార్హం.

