కలం, వెబ్ డెస్క్: భారీ స్కోర్లు, సిక్సర్ల వర్షం, ఉత్కంఠభరిత పోరాటం.. వెరసి క్రికెట్ ప్రేమికులకు కావాల్సిన అసలు సిసలు మజా లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన పోరులో లభించింది. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో చెన్నై బ్యాటర్లు చూపిన తెగువ, లక్నో బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టింది. జోష్ ఇంగ్లిస్ వీరోచిత ఇన్నింగ్స్‌ను ఉర్విల్ పటేల్ (Urvil Patel) తన విధ్వంసకర బ్యాటింగ్‌తో వెనక్కి నెట్టేయడంతో, చెన్నై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే చెన్నై బౌలర్లపై విరుచుకుపడిన ఇంగ్లిస్, కేవలం 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 85 పరుగులు చేసి మైదానాన్ని హోరెత్తించాడు. మిడిల్ ఆర్డర్‌లో మిచెల్ మార్ష్ (10), రిషబ్ పంత్ (15) తక్కువ స్కోరుకే వెనుదిరిగినా, చివర్లో షాబాజ్ అహ్మద్ అజేయంగా 43 పరుగులు (25 బంతులు, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి జట్టు స్కోరును 200 మార్కు దాటించాడు. చెన్నై బౌలర్లలో జేమీ ఓవర్టన్ 3 వికెట్లతో రాణించగా, అన్షుల్ కంబోజ్ 2 వికెట్లు తీసి లక్నోను 203/8 వద్ద కట్టడి చేయగలిగారు.
కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (42), సంజు శాంసన్ (28) శుభారంభం ఇచ్చారు. అయితే, మూడో నంబర్‌లో వచ్చిన ఉర్విల్ పటేల్ ఇన్నింగ్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. కేవలం 23 బంతులు ఎదుర్కొన్న పటేల్, ఏకంగా 8 సిక్సర్లు బాది 65 పరుగులు సాధించి లక్నో బౌలింగ్ యూనిట్‌ను చిన్నాభిన్నం చేశాడు. 282.60 స్ట్రైక్ రేట్‌తో అతను ఆడిన తీరు మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేసింది.
చివర్లో డెవాల్డ్ బ్రెవిస్ (10), కార్తీక్ శర్మ (20) త్వరగా అవుట్ కావడంతో మ్యాచ్ కాస్త ఉత్కంఠగా మారింది. అయితే, అనుభవజ్ఞుడైన శివమ్ దూబే (15 నాటౌట్), ప్రశాంత్ వీర్ (17 నాటౌట్) ఎక్కడా తడబడకుండా మరో 4 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పూర్తి చేశారు. లక్నో బౌలర్లలో షాబాజ్ అహ్మద్, దిగ్వేష్ రాఠీ చెరో రెండు వికెట్లు తీసినప్పటికీ, చెన్నై బ్యాటర్ల దూకుడు ముందు వారి ప్రయత్నాలు ఫలించలేదు. మొత్తానికి 19.2 ఓవర్లలో 208 పరుగులు చేసిన చెన్నై, ఒక అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

