కలం, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో NDA కూటమి అధికారంలో ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలిచామని.. రెండు ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకున్నామని చెప్పారు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఒక కుటుంబం చేతిలో 10 ఏళ్లు తెలంగాణ బందీ అయ్యిందని మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి విమర్శించారు. తెలంగాణ ఆగమవుతుందని.. అప్పుల పాలవుతోందని అన్నారు. బీజేపీ ఏం తెచ్చిందని బీఆర్ ఎస్, కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వలె అబద్ధాల గ్యారంటీలు ఇవ్వబోమని విమర్శించారు. బీసీలు, విద్యార్థులు, దళితులకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. 8 మంది బీజేపీ ఎంపీలు తెలంగాణకు ఏం తెచ్చారని అంటున్నారన్న ఆయన బీజేపీ ఏదైనా హామీ ఇస్తే కచ్చితంగా నెరవేర్చితీరుతుందని చెప్పారు. కాంగ్రెస్‌లాగా మాట ఇచ్చి మోసం చేసే పార్టీ కాదని తెలిపారు. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ దిగజారి మాట్లాడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటే ముస్లిం అని.. ముస్లిం అంటే కాంగ్రెస్ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌లో ముస్లింలు తప్ప హిందువులు ఉండకూడదా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి సీఎంగా ఉండి ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు.

