కలం, నిజామాబాద్ బ్యూరో: “ఆకాశమంత పందిరి వేసి భూదేవంత పీట వేసి” అంటూ సాగె సెక్రెటరీ సినిమాలోని పాట, సాధారణంగా ఘనంగా సీతారాముల పెళ్లి లేదా అంగరంగ వైభవంగా జరిగిన పెళ్ళిని ఉద్దేశించి సినీ కవి ఆత్రేయ రచించి ఉంటారు. కానీ నిజామాబాద్ జిల్లాలో నిజంగానే అలాంటి పెళ్లి వేడుకనే నిజంగా జరిగింది. ఒక చెరువులో జరిగిన ఆ పెళ్లి వింతలూ విశేషాలపై కలం ప్రత్యేక కథనం..
ఉపాధి హామీ కూలీలే బంధువులు..
నిజామాబాద్ (Nizamabad) జిల్లా పురాణిపేట గ్రామంలో జరిగిందీ ఈ శుభకార్యం. ఉపాధి హామీ కూలీలే బంధువులు.. కుటుంబ సభ్యులుగా మారారు. పైన ఏం టెంట్ లేదు.. సైడ్ వాల్స్ లేవు.. చెరువులోనే.. ఆకాశమంత పందిరి.. కింద భూదేవి సాక్షిగా పెళ్ళి బంధంతో వారు మళ్ళీ ఒక్కటయ్యారు. అసలు విషయం ఏమిటంటే.. తోట రాజన్న, తోట నర్సు దంపతుల షష్టిపూర్తి (Unique Shashtipoorthi) సందర్భాన్ని పురస్కరించుకొని.. కూలీలు కొత్త ఆలోచన చేశారు. ఆ దంపతులకు చెరువులోనే షష్టిపూర్తి వేడుక జరిపించారు. పెళ్లి బట్టలు వేయించి వారే వేదపురోహితులై వృద్ధుడైన వరుడి చేత వధువుకి తాళి కట్టించారు. ఇదంతా శాస్త్రోక్తంగా జరిపించారు. తలంబ్రాలు చల్లారు.. అరుంధతీ నక్షత్రాన్ని చూపించారు. మహిళలు పురుష కూలీలు ఫోటోలు దిగారు.
పెళ్ళయ్యాక నృత్యాలు చేశారు.. నవ వరుడిని ఎత్తుకొని డ్యాన్సులు చేశారు. ఈ శుభసందర్భంగా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.. ఆపై భోజనాలు ఆరగించారు. ఈ అరుదైన పెళ్లి వేడుక అందరి నోళ్ళల్లో నానుతుంది. తోటి కూలీల నడుమ జరిగిన ఈ ఉత్సవం ద్వారా పొందిన అనుభూతి నిజంగా చనిపోయే వరకూ గుర్తుంటుందని ఆ నవ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజమే కదా కోట్లు ఖర్చు అయినా అంగరంగ వైభవంగా హంగూ ఆర్భాటాల నడుమ పెళ్లి జరిగినా ఇంత ఆనందం పొందలేరేమో అనిపిస్తుంది.
Read Also: లడఖ్‌లో హైదరాబాద్ యువకుడి పర్వతారోహణ.. డీజీపీ ఫోటోతో ఎమోషనల్ పోస్ట్!
Follow Us On: Sharechat

