Mobile Popup Ad
Mobile Popup Ad

పేదరికం నుంచి ప్రపంచ స్థాయికి.. రీతూ కథ ఇదే..

కలం, వెబ్ డెస్క్: అహ్మదాబాద్‌లో జరిగిన తొలి ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణ పతకాలు గెలిచి భారత క్రీడా ప్రపంచాన్ని  గర్వపడేలా చేసింది 20 ఏళ్ల రీతూ మండల్ (Ritu Mondal). పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో ఓ చిన్న గ్రామానికి చెందిన ఈ యువ క్రీడాకారిణి తండ్రి ఓ రోజు కూలీ. కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు మధ్య మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు ప్రపంచ వేదికపై స్వర్ణ విజయంగా నిలిచింది. రీతూ విజయం వెనుక ఎన్నో ఏండ్ల కఠోర శ్రమ, త్యాగం, పట్టుదల ఉన్నాయి. ఆమె పోటీలు చూసేందుకు అహ్మదాబాద్‌కు వెళ్లిన తల్లిదండ్రులు, అన్న గౌతమ్.. భారత జెండాను భుజాలపై వేసుకుని రీతూ సంబరాలు చేసుకుంటున్న దృశ్యాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు.

కుటుంబం అండతో మొదలైన ప్రయాణం

ఆర్థిక పరిస్థితులు అంతగా అనుకూలంగా లేకపోయినా తన కలలను కుటుంబం ఎప్పుడూ ప్రోత్సహించిందని రీతూ (Ritu Mondal) తెలిపింది. తన వయసు పిల్లలు ఇతర పనుల్లో బిజీగా ఉన్న సమయంలో తాను యోగాసన సాధనకే ఎక్కువ సమయం కేటాయించానని చెప్పింది. మార్గంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా లక్ష్యాన్ని నమ్మి ముందుకు సాగినట్లు పేర్కొంది.

అన్నే గురువు.. అన్నే ప్రేరణ

రీతూ విజయ ప్రయాణంలో ఆమె అన్న గౌతమ్ కీలక పాత్ర పోషించాడు. ఒకప్పుడు యోగాసన క్రీడాకారుడిగా రాష్ట్ర స్థాయిలో పోటీ పడిన గౌతమ్, ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన క్రీడా జీవితాన్ని కొనసాగించలేకపోయాడు. ప్రస్తుతం ఫిజియోథెరపీ పూర్తి చేసిన ఆయన, తన కలలను చెల్లెలి ద్వారా సాకారం చేయాలనే లక్ష్యంతో ఆమెకు మార్గనిర్దేశనం చేస్తున్నాడు. రీతూలోని ప్రతిభను గుర్తించిన గౌతమ్, ఎప్పుడూ ఆమెను మరింత మెరుగుపడాలని ప్రోత్సహిస్తుంటాడని ఆమె చెప్పింది. మంచి ప్రదర్శన చేసినప్పటికీ ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని గుర్తు చేస్తూ ముందుకు నడిపిస్తాడని తెలిపింది.

జాతీయ స్థాయి నుంచి ప్రపంచ వేదిక వరకు

ప్రపంచ స్థాయిలో మెరవకముందే రీతూ దేశీయ పోటీల్లో తన సత్తా చాటింది. చెన్నైలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్, అస్సాంలో నిర్వహించిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో కాంస్య పతకాలు సాధించింది. ఈ విజయాలే అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయని భావిస్తోంది.

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర

అహ్మదాబాద్‌లో ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన అగ్రశ్రేణి యోగాసన క్రీడాకారులతో పోటీ పడిన రీతూ అద్భుత ప్రదర్శన కనబరిచింది. సమతుల్యత, వంపుసొంపులు, శారీరక బలం, ఖచ్చితత్వంతో ఆకట్టుకుని రెండు స్వర్ణ పతకాలు గెలుచుకుంది. ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.

ఒలింపిక్ పతకమే అంతిమ లక్ష్యం

ఈ విజయంతో సంతోషంగా ఉన్నప్పటికీ తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని రీతూ భావిస్తోంది. అంతర్జాతీయ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటోంది. యోగాసన ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, చివరకు ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకోవాలని, భారత్‌కు ఒలింపిక్ పతకం అందించడం తన అతిపెద్ద కల అని వెల్లడించింది.

స్కాలర్‌షిప్‌తో అండగా నిలిచిన యూనివర్సిటీ

రీతూ క్రీడా ప్రయాణానికి గాల్గోటియాస్ యూనివర్సిటీ కూడా మద్దతు ఇస్తోంది. నెలకు రూ.13 వేల స్కాలర్‌షిప్ అందిస్తూ ఆమె శిక్షణ, ఇతర ఖర్చులకు సహాయం చేస్తోంది. ఈ ఆర్థిక సహాయం వల్ల కుటుంబంపై భారం తగ్గి, పూర్తిగా క్రీడపై దృష్టి పెట్టగలుగుతున్నానని రీతూ తెలిపింది.

తల్లిదండ్రుల త్యాగాలే బలం

తన విజయాల వెనుక తల్లిదండ్రుల త్యాగాలు, నమ్మకం ఉన్నాయని రీతూ పేర్కొంది. ప్రతి దశలో వారు ఇచ్చిన మద్దతే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని కృతజ్ఞతలు తెలిపింది. ఒక చిన్న గ్రామం నుంచి ప్రపంచ వేదిక వరకు చేరుకున్న రీతూ మండల్ ప్రయాణం.. కలలను నమ్మి కష్టపడితే విజయాన్ని అందుకోవచ్చని మరోసారి నిరూపించింది.

Read Also: ల‌డ‌ఖ్‌లో హైద‌రాబాద్ యువ‌కుడి ప‌ర్వ‌తారోహ‌ణ‌.. డీజీపీ ఫోటోతో ఎమోష‌న‌ల్ పోస్ట్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>