epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

ఫోన్​ ట్యాపింగ్ తో ఎవరినీ ఎదగనీయకుండా కుట్ర : ఎంపీ చామల

కలం, వెబ్​ డెస్క్​ : ఫోన్​ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) కేసీఆర్​ ను సిట్ విచారించనున్న నేపథ్యంలో బీఆర్​ఎస్​ నేతల హడావిడిపై ఎంపీ చామల కిరణ్​ కుమార్​ రెడ్డి (MP Chamala) మండిపడ్డారు. ఎవరినీ ఎదగనీయకుండా ఫోన్​ ట్యాపింగ్​ చేశారని ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇస్తే తెలంగాణ ఆత్మ గౌరవం అంటూ లబోదిబోమంటున్నారని మండిపడ్డారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ కోసం ఇజ్రాయిల్ నుంచి పరికరాలు కొనుగోలు చేస్తారా? అని ప్రశ్నించారు.

స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచ్ లో సీసీ కెమెరాలు బంద్ చేసి పరికరాలు, ఫైల్స్ ధ్వంసం చేసి మూసీ నదిలో, వికారాబాద్ అడవుల్లో పడేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు. ఇప్పుడు తెలంగాణ ఆత్మ గౌరవం గుర్తుకు వస్తుందా అని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ పౌర హక్కులు హరించాయని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులు, అధికారులు, స్వంత బిడ్డ, అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్​ పాలనలో తెలంగాణలో అరాచక పాలన చేసినట్లు కవిత చెప్పారని గుర్తు చేశారు.

‘టీఆర్ఎస్ పేరులో తెలంగాణ పదాన్ని తీసివేసి బిఆర్ఎస్ అని పెట్టినప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడికి పోయింది. తెలంగాణ ప్రజలకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అని కేసీఆర్ చెప్పారు.
తెలంగాణ అమరవీరులను విస్మరించినప్పుడు కేసీఆర్ కు తెలంగాణ ఆత్మ గౌరవం గుర్తుకు రాలేదా?. గద్దర్ ను నీ గేటు దగ్గర ఆపినప్పుడు ఆత్మ గౌరవం ఎటు పోయింది. తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరాంని అర్ధ రాత్రి తలుపులు బద్దలు కొట్టి తీసుకువెళ్లినప్పుడు ఆత్మ గౌరవం గుర్తుకు రాలేదా?’ అని చామల ప్రశ్నించారు.

ఉచిత బస్సుల విషయంలో మహిళలను కించపరిచే విధంగా కేటీఆర్ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికి వాళ్లే అధికారంలో ఉంటామనుకోని బీఆర్ఎస్​ నాయకులు విర్రవీగారన్నారు. నిరసనల పేరుతో డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను తరిమికొట్టి ఆత్మ గౌరవాన్ని కాపాడారన్నారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మోసం చేసిన కేసీఆర్.. తెలంగాణ జాతిపిత కాదన్నారు. ఇంటికో ఉద్యోగం అని తన కుటుంబంలో ఐదుగురికి కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ సీఎంకు తెలియకుండా జరగదని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రభాకర్ రావు ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. సిట్ కు కేసీఆర్​ సహకరించి, తప్పు చేస్తే శిక్ష అనుభవించాలని ఎంపీ చామల కిరణ్​ (MP Chamala) హితవు పలికారు.

Read Also: నందిన‌గ‌ర్ నివాసానికి చేరుకున్న కేసీఆర్‌

Follow Us On: Instagram

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>