కలం, వెబ్ డెస్క్ : రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒక దేశంపై మరోదేశం దాడులకు పాల్పడుతూనే ఉంది. ఈ క్రమంలో రష్యా (Russia)లోని టాటార్‌స్తాన్ ప్రాంతంలో ఉన్న నిజ్నెకామ్స్క్ నగరంలోని ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం లక్ష్యంగా ఉక్రెయిన్ (Ukraine) డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో కనీసం 12 మంది మరణించగా, 39 మంది గాయాలయినట్లు నిజ్నెకామ్స్క్ నగర మేయర్ రాడ్మిర్ బెలియేవ్ సోమవారం వెల్లడించారు.
రష్యాలోని అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతంలో దాడి జరగడంతో చమురు శుద్ధి కర్మాగారం దెబ్బతిన్నట్లు పలు రష్యన్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. కాగా, ఉక్రెయిన్ దాడి అనంతరం టాటార్‌స్తాన్ అధినేత రుస్తమ్ మిన్నిఖానోవ్ సంతాప దినాలుగా ప్రకటించారని బెలియేవ్ వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్.. రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు తీవ్రమయ్యాయి. ఈ చర్యల కారణంగా రష్యాలోని అనేక ప్రాంతాల్లో ఇంధన కొరత ఏర్పడినట్లు అంతర్జాతీయ మీడియాలు పేర్కొన్నాయి.

