కలం, వెబ్‌డెస్క్: రాజమండ్రిలో యువకులు కార్ ఎక్కించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ప్రియాంకకు మంత్రి వాటికి శ్రీహరి (Minister Vakiti Srihari) నివాళులు అర్పించారు. ప్రియాంక స్వగ్రామం గద్వాల జిల్లా ఐజ మండలంలోని ఏక్లాస్‌పూర్. కాగా, ఆమె రాజమండ్రిలో వైద్య విద్యను అభ్యసిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 4న ప్రసాదిత్యా మాల్ వద్ద ప్రియాంకపైకి ఇద్దరు యువకులు కారు ఎక్కించారు. ఈ ఘటనలో ప్రియాంక తలకు తీవ్ర గాయమైంది ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు పరీక్షించి బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రియాంక ఆదివారం తుది శ్వాస విడిచింది.
గాంధీ ఆస్పత్రిలో ప్రియాంక భౌతికకాయానికి మంత్రి వాకిటికి శ్రీహరి, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ నివాళులు అర్పించారు. ఆమె తండ్రి వెంకటేష్‌తో మాట్లాడి ఓదార్చారు. ముందుగా సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి నుంచి ప్రియాంక మృతదేహాన్ని గాంధీకి తరలించారు. అక్కడ పోస్టుమార్టం పూర్తి చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. అక్కడి నుంచి స్వగ్రామం ఏక్లాస్‌పురానికి తరలించారు. ఈ రోజు సాయంత్రం ఏక్లాస్‌పురంలో ప్రియాంక అంత్యక్రియలు జరుగనున్నాయి.

