జహీరాబాద్‌ ప్ర‌భుత్వ భూముల్లో ‘పార్కింగ్’ పేరిట భారీ దందా!

క‌లం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా జ‌హీరాబాద్ ( Zaheerabad)  ప‌ట్ట‌ణ శివారులో అత్యంత విలువైన‌ ప్ర‌భుత్వ భూమి అది. కానీ ప్రైవేటు వ్య‌క్తులు ప్ర‌భుత్వ‌ భూమిని క‌బ్జా చేసి , భూములకు సంబంధించిన హ‌ద్దుల‌ను లేకుండా చేసి పార్కింగ్ దందాకు తెర‌లేపారు. ప్ర‌భుత్వ భూమిలో ద‌ర్జాగా పార్కింగ్ ర‌సీదుల‌ను ఇస్తూ ప‌గ‌లు రాత్రి అనే తేడా లేకుండా ల‌క్ష‌లాది రూపాయలు దండుకుంటున్నారు. జ‌హీరాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంకు చెందిన ముఖ్య నేత అండ‌దండాల‌తో స్ధానిక అధికార పార్టీ నాయ‌కులు యథేచ్ఛగా జ‌హీరాబాద్ పార్కింగ్ దందాను కొన‌సాగిస్తుండ‌టంతో అధికారులు చ‌ర్య‌లు తీసుకువ‌డానికి జంకుతున్న‌ర‌నే ఆరోపణలు విన్పిస్తున్నాయి.

ఖ‌రీదైన భూమి… అన్యాక్రాంతం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఇటు జాతీయ రహదారికి , అటు బీదర్ X రోడ్డు కు సమీపంలోని సర్వే నంబర్ 305/2 లో సుమారు 10 ఎకరాల భూమి ఉన్న‌ది . పట్ట‌ణ శివారు, హైవేకు ద‌గ్గ‌ర‌గా ఉండ‌టంలో ఎక‌రా భూమి కోటల్లో విలువ చేస్తుంది. ఈ ప్రాంతం చుట్టు ప‌క్క‌ల వాహ‌న త‌యారీ రంగంకు చెందిన మ‌హేంద్ర అండ్ మహేంద్ర , ఎంజీ , ముంగి ప‌రిశ్ర‌మ‌లు ఉన్నాయి. దీంతో ఇక్క‌డి కంపెనీల‌లో త‌యారు చేసిన వాహ‌నాల‌ను లోడ్ చేసుకొవ‌డానికి రోజు వివిధ రాష్ట్రాల నుండి భారీ వాహ‌నాలు ,కంటెన‌ర్స్ వ‌స్తుంటాయి . వారు లోడింగ్ , అన్ లోడింగ్ చేసుకొవ‌డానికి కొన్ని సంద‌ర్బ‌ల్లాలో మూడు నుంచి నాలుగు రోజులు వేచి ఉండాల్సివ‌స్తుంది .

నిత్యం వంద‌లాది వాహ‌నాలు వ‌స్తుండ‌టంతో ముంబై హైవే, బీద‌ర్ క్రాస్ రోడ్డుకు అనుకొని ఉన్న ప్ర‌భుత్వ భూమిలో స్థానిక అధికార పార్టీ నేతలు పార్కింగ్ దందాకు తెర‌లేపారు. అనుకున్న‌దే త‌డ‌వుగా ప్రభుత్వ భూమి చుట్టూ వేసినా ఫేన్సింగ్ తొల‌గించి , హ‌ద్దు రాళ్ల‌ను సైతం విరకొట్టి , అందులోని స్థలాన్ని లారీలు, కంటెన‌ర్స్ పార్కింగ్‌కు అనువుగా చ‌దును చేశారు. కొందరు జ‌హీరాబాద్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బడా నేతలు వాహ‌న‌ల పార్కింగ్ ను త‌మ అదాయ వ‌న‌రుగా మార్చుకున్నారు. జహీరాబాద్ పట్టణం అనుకొని అనేక పరిశ్రమలు ఉండడంతో ఆ పరిశ్రమలకు వచ్చిన లారీలను రోజుకు వందల సంఖ్యలో ఈ ప్రభుత్వ స్థలంలో టోకెన్లు ఇచ్చి మరీ కబ్జాదారులు పార్కింగ్ దందా నిర్వహిస్తున్నారు. న్యూ జహీరాబాద్ లారీ ఓనర్ అసోసియేషన్ పేరుతో ఈ స్థలంలో ప్రైవేటు వాహనాలకు స్థలాన్ని అద్దెకు ఇచ్చి ప‌గ‌లు ,రాత్రి అనే తేడా లేకుండా ఒక్కొ త‌ర‌హ వాహ‌నంకు ఒక్కొ త‌ర‌హ అద్దెల‌ పేరుతో ర‌శీదులు ఇస్తూ నెలకు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు.

జ‌హీరాబాద్ ప్ర‌జాప్ర‌తినిధి నుండి ఒత్తిడి

జ‌హీరాబాద్ ప‌ట్ట‌ణ శివారు బీదర్ X రోడ్డు దగ్గ‌ర‌గా ఉన్న305/2లోని 10 ఎకరాల ప్రభుత్వ భూమిలో జ‌రుగుతున్న పార్కింగ్ దందా పై జహీరాబాద్ తహసీల్దార్ వివరణ కోరగా సర్వే నంబర్ 305/2లోని 10 ఎకరాల భూమి ప్రభుత్వ భూమేనని, పది సంవత్సరాల కింద భూమి చుట్టూ ఫెన్సింగ్ వేయించి ప్రభుత్వ భూమిని బోర్డును ఏర్పాటు చేశామని తహసీల్దార్ దశరథ్ తెలిపారు. లారీల‌ పార్కింగ్ కోసం స్థలాన్ని ఇతరులకు అద్దెకు ఇస్తున్నారన్న సమాచారం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై విచార‌ణ జ‌రిపి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. ఇక ఇప్పుడు రెవెన్యూ అధికారులు పార్కింగ్ దందాపై దాటవేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

అయితే ఈ ప్రభుత్వ భూమిని కాపాడాలని, క‌బ్జాల‌ను తొలగించాలని ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నప్పటికీ.. జహీరాబాద్ తహసీల్దార్ ప్రభుత్వ భూమి కబ్జాపై చర్యలు తీసుకోకుండా కాల‌యాప‌న చేస్తూ , మీన‌వేషాలు లెక్క‌పెట్ట‌డానికి స్థానిక జ‌హీరాబాద్ ప్ర‌జాప్ర‌తినిధి నుండి ఒత్తిడి ఉండ‌ట‌మే కార‌ణ‌మ‌నే అరోపణ‌లు విన్పిస్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో పెద్దఎత్తున ఈ పార్కింగ్ దందా పై స్ధానికంగా చ‌ర్చ జ‌రుగుతూ, జ‌హీరాబాద్ అధికార పార్టీ నేత‌ల దందాల‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్న‌ప్ప‌టికి .. ఓటు బ్యాంకు రాజ‌కీయాల కోసం ఓ కీల‌క నేత వారికి స‌హ‌క‌రిస్తూ… వారి అక్ర‌మ దందాల‌కు అండ‌గా ఉంటున్నాడ‌ని ప్ర‌తిప‌క్ష నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అ జ‌హీరాబాద్ ముఖ్య‌నేత మ‌ద్ద‌తుగా ఉండ‌టం వ‌ల‌నే క‌బ్జాల‌పై చ‌ర్య‌లు తీసుకోవడం లేద‌ని వాదిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు జహీరాబాద్ రెవిన్యూ అధికారుల అండదండలతో లక్షల్లో వ్యాపారం చేస్తున్న విష‌యంపై జిల్లా ఉన్నతాధికారులు క‌ల్పించుకొని , కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని ఆధీనంలో తీసుకొని, పార్కింగ్ దందా ను నిర్వ‌హిస్తున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్ర‌భుత్వ స్థలంను స్వాధీనం చేసుకోవాలి

దాదాపు రెండేళ్లుగా బ‌హిరంగంగా పార్కింగ్ దందా న‌డుస్తున్న‌ప్ప‌టికి సంబంధిత రెవెన్యూ అధికారులు మాత్రం చూసిన‌ట్టు వ‌దిలేస్తున్నారనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కొట్లాది రుపాయ‌ల విలువైన ప్ర‌భుత్వ భూమికి సంబంధించిన ఫెన్సింగ్ ను తొల‌గించి , హ‌ద్దు రాళ్ల‌ను విర‌గ‌గొట్టి, ప్ర‌భుత్వ భూమిని క‌బ్జా చేసినప్ప‌టికి రెవెన్యూ అధికారులు పార్కింగ్ దందా ప‌ట్ల చూసిచూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారనే వాదనలున్నాయి. అధికార పార్టీకి చెందిన నేత‌లు చేస్తున్న పార్కింగ్ దందాపై మున్సిపాల్ కౌన్సిల్ లో కౌన్సిల‌ర్ల తో స‌హ ,స్ధానికులు ఎమ్మెర్వో ఎన్ని ఫిర్యాధులు ఇచ్చినప్ప‌టికి ప‌ట్టించుకొవ‌డం లేదని కొందరి వాదన.

ఈ క్రమంలోనే ప్ర‌భుత్వ భూముల‌ ప‌రిర‌క్ష‌ణ ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తే , కోట్లాది రుపాయ‌ల విలువ‌చేసే ప‌ది ఎక‌రాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుంద‌ని స్ధానికులు చెబుతున్నారు. ఎన్ని ఫిర్యాదులు ,అరోప‌ణ‌లు వ‌చ్చిన‌ప్ప‌టికి ఇప్ప‌టికీ ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన అధికార పార్టీకి చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు యథేచ్ఛగా లక్షల్లో వ్యాపారాలు చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు.

ఈ విషయంపై రెవెన్యూ అధికారుల దృష్టికి పలుమార్లు ప్రజలు తీసుకెళ్లిన పట్టించుకోకపోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారుల తీరు మాత్రం కబ్జాదారులకు వత్తాసు పలికినట్టే ఉంద‌ని అగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. క‌బ్జాదారులు ప‌బ్లిక్ గా పార్కింగ్ ర‌శీదు ఇస్తూ మ‌రి అక్ర‌మ‌ దందాను కొన‌సాగిస్తున్న కూడా సంబంధిత‌ రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని , ఇప్ప‌టికైన ఈ ప్రభుత్వ భూములపై సమగ్ర విచారణ జరిపి, ఎంతో విలువైన భూముల‌ను ప‌రిర‌క్షించాలని జ‌హీరాబాద్ ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>