కలం, ఖమ్మం బ్యూరో: ఎగువ ప్రాంతమైన ఛత్తీస్గఢ్లో కురుస్తున్న కుండపోత వర్షాల ధాటికి భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు (Taliperu Project) వరద పోటెత్తుతోంది. బీజాపూర్, సుక్మా జిల్లాల్లోని గుట్టల ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి జలాశయానికి ఒక్కసారిగా ఇన్ ఫ్లో పెరిగింది. స్థానిక వర్షాల తాకిడి కూడా తోడవటంతో ప్రస్తుతం ప్రాజెక్టుకు 12,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. పరిస్థితి తీవ్రతను గమనించిన ఇరిగేషన్ అధికారులు గురువారం తక్షణమే స్పందించి జలాశయం 13 గేట్లను ఎత్తివేసి, దిగువన ఉన్న గోదావరి నదిలోకి 17,000 క్యూసెక్కుల మిగులు నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా, వరద ప్రవాహంతో నీటిమట్టం ప్రస్తుతం 73.16 మీటర్లకు చేరుకుంది. ఎగువన వర్షాలు ఏకధాటిగా కురుస్తుండటంతో ఈ రాత్రికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని డీఈఈ తిరుపతి తెలిపారు. ప్రాజెక్టు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇరిగేషన్ అధికారులు, సిబ్బందిని ముందస్తుగా అప్రమత్తం చేసి, నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జలవనరుల శాఖ అధికారులు హెచ్చరించారు. వరద నీటిని గోదావరిలోకి వదులుతూనే ఆయకట్టు రైతులకు ఇబ్బంది కలగకుండా అధికారులు సమర్థవంతంగా చర్యలు చేపట్టారు. ఎడమ, కుడి కాలువల గేట్లను కూడా తెరిచి పంట పొలాలకు అవసరమైన సాగునీటిని నిరంతరాయంగా అందిస్తున్నారు.

