కలం, వెబ్‌డెస్క్: అసెంబ్లీ సమావేశాల ప్రారంభంతోనే తమిళనాడు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. అసెంబ్లీలో చర్చల అనంతరం సీఎం విజయ్ (CM Vijay) ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) మండిపడ్డారు. సభలో ఉన్నప్పుడు సమాధానం చెప్పకుండా, ఇంటికి వెళ్లి ప్రకటనలు విడుదల చేయడం ఏమిటని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల తీర్పును గౌరవించి తాము ప్రతిపక్షంలో కూర్చున్నట్లు ఉదయనిధి స్పష్టం చేశారు. అంతే తప్ప మెజారిటీ లేకపోయినా పదవి కోసం గవర్నర్ ఇంటి చుట్టూ తిరగలేదని ఎద్దేవా చేశారు. తమ పార్టీని ప్రజలు తిరస్కరించారంటున్న సీఎం, అదే ప్రజలు డీఎంకేకు వేసిన ఓట్లు చూపి తాను సీఎం అయ్యారన్న విషయం మర్చిపోవద్దని గుర్తు చేశారు.
గతంలో 2006లో డీఎంకే పాలనపై సీఎం విజయ్ చేసిన విమర్శలను ఉదయనిధి ఖండించారు. 2006లోనే డీఎంకే ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనడమో, పార్టీలను చీల్చడమో లేదా సోఫా సెట్లు పంపితేనో తమ ప్రభుత్వం రాలేదన్నారు. అది కూటమి పార్టీల మద్దతుతో, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అని స్పష్టం చేశారు. అయితే ఇటీవల ఎన్నికల్లో డీఎంకే ఓడిపోయి ఉండవచ్చు కానీ, ద్రవిడ మోడల్ పాలనలో సంక్షేమ పథకాలు కొనసాగుతాయని సీఎం నోటితోనే చెప్పంచడమే ప్రతిపక్షంగా తమ విజయమని ఉదయనిధి ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన #sofamodel అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించి ప్రస్తుత ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

