కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లాలో బాలుడి అనుమానాస్పద మృతి చర్చనీయాంశంగా మారింది. సదాశివపేట మండలం ఎంకెపల్లి (Enkepalli) గ్రామానికి చెందిన టేకూరి చంద్రశేఖర్ కుమారుడు మహాతేజ్ శనివారం సాయంత్రం చెరువులో పడి మృతి చెందాడు. సాయంత్రం 5 గంటల సమయంలో బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికుల సాయంతో గాలించగా చెరువులో బాలుడి ఆచూకీ లభించింది. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఇంటి వెనకాలే ఉన్న డ్రైనేజీ కాలువ కూడా దాటలేని రెండేళ్ల బాలుడు చెరువు వరకు వెళ్లి అందులో ఎలా పడిపోయాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలుడే వెళ్లి పడిపోయాడా.. మరేదైనా కారణం ఉందా? అని మృతుడి తండ్రి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సదాశివపేట పోలీసులు తెలిపారు.

