కలం, వెబ్ డెస్క్: పాకిస్థాన్ సరిహద్దులోని అవుట్‌పోస్ట్ (Gurdaspur) వద్ద ఇద్దరు భారత పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాక్ సరిహద్దులోని డోరంగ్ల చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ గుర్నామ్ సింగ్, హోంగార్డ్ అశోక్ కుమార్ చనిపోయి ఉండడాన్ని ఆదివారం తెల్లవారుజామున గుర్తించారు. మృతుల శరీరాలపై బుల్లెట్ గాయాలు ఉన్నాయి.
అవుట్‌పోస్ట్‌లోని(Gurdaspur) ఓ గదిలో మృతులిద్దరూ బుల్లెట్ గాయాలతో పడి ఉండడంతో ఇది పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన దాడిగా అనుమానిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి 1గంట సమయంలో ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
ఏదైనా వివాదం కారణంగా పరస్పరం కాల్చుకొని చనిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, డ్రగ్స్ మాఫియా గ్యాంగ్స్టర్లు, ఉగ్రవాదుల చొరబాటు కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు గురుదాస్‌పూర్ సీనియర్ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్(ఎస్ఎస్పీ) ఆదిత్య శర్మ తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రాంతం అత్యంత సున్నితమైన ఇండియా–పాకిస్థాన్ (India – PAK) ఇంటర్నేషనల్ బోర్డర్ (ఐబీ) వద్ద ఉండడంతో భద్రత దళాలు అప్రమత్తమయ్యాయి. సంఘటన సరిహద్దు ప్రాంతంలో జరగడంతో పంజాబ్ మొత్తం అలెర్ట్ ప్రకటించారు.
Read Also: నాడు కుంభకోణాలు.. నేడు అభివృద్ధి : ప్రధాని మోడీ
Follow Us On : WhatsApp


