కలం, వెబ్‌డెస్క్: ఇటీవల ఘట్కేసర్ (Ghatkesar)-బోడుప్పల్ హైవేపై రాత్రి వేళ కార్లను వెంబడిస్తూ కొందరు పోకిరీలు ప్రజలను భయ భ్రాంతులకు గురి చేసిన విషయం తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూన్ 29న సోమవారం ఓ కుటుంబం పెళ్లికి వెళ్లి అర్ధరాత్రి తమ కారులో తిరిగి ఇంటికి వెళ్తోంది. ఈ సమయంలో అటుగా బైక్ వెళ్తున్న ఇద్దరు యువకులు శివ, అఖిల్ బైక్ పై స్టంట్లు చేస్తూ వీరి కారును వెంబడిస్తూ హల్‌చల్ చేశారు. కారుకు దగ్గరగా వస్తూ కారును చేతితో కొడుతూ భయభ్రాంతులకు గురి చేశారు. అంతే కాకుండా నోటికి వచ్చినట్లు బూతులు తిడుతూ, కేకలు వేస్తూ అల్లరి చేశారు.
సదరు కుటుంబం ఈ ఘటనను వీడియో చిత్రీకరించింది. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై బాధితులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నారు. నిందితులు భువనగిరి మండలం హన్మాపురానికి చెందిన రంగ శివ, అఖిల్‌లుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్ చేసినా, రోడ్డు పై నిబంధనలు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

