కలం, వెబ్ డెస్క్: తమిళనాడు (Tamil Nadu) ఎన్నికలు జరుగుతున్న వేళ టీవీకే చీఫ్ విజయ్ (TVK Vijay) ఈసీకి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖలో విజయ్ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా చెన్నై సహా ప్రధాన నగరాల్లో రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల విధుల కోసం భారీ సంఖ్యలో బస్సులను వినియోగించడంతో సామాన్య ఓటర్లు గమ్య స్థానాలకు చేరుకోవడం కష్టంగా మారిందని తెలిపారు. కిళంబాక్కం, కోయంబేడు బస్టాండ్లలో వేలాది జనం చిక్కుకుపోయారని వెల్లడించారు. ఇది పరిపాలనా వైఫల్యమే కాకుండా పౌరుల ప్రాథమిక హక్కుపై జరుగుతున్న దాడి అని విజయ్ విమర్శించారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజయ్ డిమాండ్ చేశారు. బస్టాండ్లలో చిక్కుకున్న ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించాలని కోరారు. రాష్ట్రంలో చాలా చోట్ల పోలింగ్ మందకొడిగా సాగుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో అదనపు బస్సులు నడపాలని సూచించారు. అలాగే ఓటర్లందరూ తమ హక్కును వినియోగించుకునేలా పోలింగ్ సమయాన్ని మరో రెండు గంటలు పొడిగించి రాత్రి 8 గంటల వరకు జరిగేలా చూడాలని విజయ్ ఈసీని అభ్యర్థించారు. రవాణా అంతరాయం, క్యూలైన్లలో జాప్యం కారణంగా ఏ ఒక్కరూ తమ ఓటు హక్కును కోల్పోవద్దని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని విజయ్ తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

