కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ వెలువడిన వేళ విజయ్ సారథ్యంలోని TVK (తమిళగ వెట్రి కజగం) పార్టీలో జోష్ పెరిగింది. తమిళనాడులో ముఖ్యమంత్రిగా విజయ్ నిలవబోతున్నారంటూ యాక్సిస్ మై ఇండియా పోల్ వ్యక్తం చేయడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరపడిపోతున్నారు. టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లను సాధిస్తుందని యాక్సిస్ మై ఇండియా పోల్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో టీవీకే చీఫ్ విజయ్ (TVK Chief Vijay) చెన్నైలోని పార్టీ ఆఫీసులో ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యేల అభ్యర్థులతో కీలక సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా అభ్యర్థులతో విజయ్ కీలక విషయాలు చర్చించారు. అలాగే మే 4 నాటి ఫలితాల సన్నాహకాలపై ఫోకస్ పెట్టిన విజయ్.. పార్టీ అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. కాగా, 234 అసెంబ్లీ స్థానాలు గల తమిళనాడు ఎన్నికల్లో టీవీకే 233 సీట్లలో ఒంటరిగా పోటీ చేసింది. విజయ్ రెండు స్థానాల్లో పోటీకి దిగారు. పెరంబూర్ ( చెన్నై), తిరుచ్చిరాపల్లి ఈస్ట్ నుంచి పోటీ చేశారు.

