కలం, వెబ్‌డెస్క్: నీట్ పేపర్ లీకేజీతో కేంద్ర ప్రభుత్వం పతిష్టాత్మకంగా తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీకేజీ బిల్లు (Anti Paper Leak Bill)ను నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై ఏడు గంటల పాటు చర్చ జరుగనుంది. ఈ సందర్భంగా మల్లిఖార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) బిల్లుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ బిల్లుతో ఎలాంటి ప్రయోజం లేదని తేల్చిచెప్పారు. పేపర్ లీకేజీ నిందితులను ప్రభుత్వమే కాపాడుతోందని ఖర్గే వ్యాఖ్యానించారు. పేపర్ లీకేజీతో విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఇప్పటికే ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు విద్యార్థులపై లాఠీ చార్జ్ చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పేపర్ లీక్ కాకుండా ముందస్తు చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ఇప్పుడు కొత్త సిలబస్‌లో మనుస్మృతిని కూడా చేర్చారని ఆరోపించారు. ఖర్గే వ్యాఖ్యలపై ఎన్‌డీఏ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. రాజ్యసభ చైర్మన్ రాధా కృష్ణన్ ఖర్గే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.

