కలం, నారాయణపేట: జర్నలిస్టుల హక్కులు, భద్రత, సామాజిక, ఆర్థిక సంక్షేమం కోసం ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ఇచ్చిన పిలుపు మేరకు అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించే ‘డిమాండ్ల దినోత్సవం’ను విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే–ఐజేయూ (TUWJ-IJU) నేషనల్ కౌన్సిల్ సభ్యుడు నక్క శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు కోయిలకొండ నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి శివశంకర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో గాంధీ విగ్రహాల వద్ద జర్నలిస్టులు నిరసన కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను కలెక్టర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు అందజేయాలని కోరారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమానికి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
నూతన మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి :
మీడియా రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా నూతన మీడియా కమిషన్ను ఏర్పాటు చేయాలని, జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక జాతీయ చట్టాన్ని తీసుకురావాలని టీయూడబ్ల్యూజే–ఐజేయూ (TUWJ-IJU) నాయకులు డిమాండ్ చేశారు. జర్నలిస్టులు, జర్నలిస్టేతర మీడియా సిబ్బందికి ప్రస్తుత జీవన వ్యయానికి అనుగుణంగా వేతనాలు కల్పించేందుకు కొత్త వేతన బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు.
జర్నలిస్టులకు ఇళ్లు.. ఆరోగ్య కార్డులు ఇవ్వాలి :
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు అందజేసి నగదు రహిత వైద్య చికిత్స సౌకర్యం కల్పించాలని కోరారు. అక్రిడిటేషన్, గుర్తింపు కార్డుల జారీతో పాటు జర్నలిస్టులు విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాజేష్, సంజీవ్ ప్రకాష్, సులిగెం సురేష్, హన్మంతు, తఖీ, శ్రీనివాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

