Mobile Popup Ad
Mobile Popup Ad

మున్నేరు రిటైనింగ్ వాల్ పనులను వేగవంతం చేయాలి: తుమ్మల

కలం, ఖమ్మం బ్యూరో: మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) ఆదేశించారు. బైపాస్ రోడ్డు ఎఫ్.సి.ఐ. నుండి వెంకటేశ్వర నగర్ బొక్కలగడ్డ వరకు నిర్మాణంలో ఉన్న మున్నేరు రిటైనింగ్ వాల్ పనులను జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్., మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్యలతో కలిసి మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఖమ్మం పట్టణాన్ని వరదల ముంపు నుండి శాశ్వతంగా రక్షించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా మున్నేరు వరదల కారణంగా పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఖమ్మం పట్టణాన్ని సురక్షితంగా ఉంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం 690 కోట్ల రూపాయల వ్యయంతో మున్నేరు రక్షణ గోడల (Munneru Retaining Wall) నిర్మాణానికి ఆమోదం తెలిపిందన్నారు.

2027 మార్చి నాటికి పూర్తి..

ఈ నిర్మాణానికి సంబంధించి అధికారులు సమర్థవంతంగా పనిచేసి దాదాపు భూసేకరణ పూర్తి చేశారని, మరో 240 మీటర్ల మేర పెండింగ్‌లో ఉన్న భూసేకరణను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. జూలై, ఆగస్టు నెలల్లో వచ్చే వరదల సమయంలో మున్నేరు జలాలు పట్టణంలోకి ప్రవేశించకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా జూన్ నెల నాటికి బైపాస్ రోడ్డు నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు కుడి, ఎడమ వైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో అత్యధికంగా పేద ప్రజలు నివసిస్తున్నారని, ప్రస్తుత సంవత్సరంలో ఈ పనులు పూర్తయితే వారికి గణనీయమైన భద్రత కలుగుతుందని తెలిపారు. 2027 మార్చి నాటికి మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

 జిల్లాలో అత్యధికంగా పంట కొనుగోళ్లు..

​అలాగే రాష్ట్రంలో రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో భారీ స్థాయిలో పంటల కొనుగోళ్లు జరుగుతున్నాయని, ఇప్పటివరకు రాష్ట్రంలో 14 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంటను కొనుగోలు చేశామని వెల్లడించారు. క్వింటాల్‌కు వెయ్యి రూపాయలకు పైగా నష్టం వచ్చినప్పటికీ, రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తోందని చెప్పారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు, ఎండల తీవ్రత తదితర కారణాలతో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఖమ్మం జిల్లాలో అత్యధికంగా పంట కొనుగోళ్లు జరిగాయని చెప్పారు.
అవసరమైతే సరిహద్దు ప్రాంతాల్లోని గోదాములను కూడా వినియోగిస్తూ పంట సేకరణ కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 65 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు జరిగిందని, దేశం మొత్తం మీద కూడా 50 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు జరగలేదని ఈ అంశాన్ని అందరూ గమనించాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>