కలం, వెబ్ డెస్క్ : జెన్ జీ యువత ఆశయాలకు అనుగుణంగా గళం వినిపించడమే లక్ష్యంగా ‘సేనా గళం’ అనే కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రకటించారు. జనసేన పార్టీ ముఖ్యనేతలతో పవన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమకాలీన రాజకీయాల్లో రాజ్యాంగానికి కట్టుబడి, అన్ని వర్గాలకు గౌరవం ఇస్తూ, దేశ సమగ్రతకు భంగం కలగకుండా వ్యవహరించేలా సేనా గళం కమిటీ పని చేయాలని ఆదేశించారు. ముల్లును ముల్లుతోనే తీయాలి అనే బూర్జువా ధోరణిని తోసిరాజేస్తూ సేనా గళం పని చేయాలని పవన్ స్పష్టం చేశారు.
అభ్యుదయ భావాలతో ముందుకు వెళ్లాలని.. పాతబడి బూజుపట్టిన విధానాలకు తిలోదకాలు ఇవ్వాలని నాయకులకు పవన్ సూచించారు. రాజకీయ పార్టీగా సామాజిక బాధ్యతతో జనసేన పార్టీ ముందుకు వెళ్తూ సేనా గళం ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో కొందరు తప్పులను వారి వ్యక్తిగత చర్యలుగా కాకుండా, కులం, మతం లేదా వర్గాలతో ముడిపెట్టి సామాజిక విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది సమాజంలో విద్వేషాలకు కారణం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత తప్పులను వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలి తప్ప, సామాజిక వర్గాలను ఆ వ్యవహారంలోకి లాగకూడదనే స్పష్టమైన విధానాన్ని అవలంబిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

