Mobile Popup Ad
Mobile Popup Ad

నాణ్యతతో అభివృద్ధి పనులు చేయాలి: మంత్రి తుమ్మల

కలం, ఖమ్మం బ్యూరో: గ్రామాల్లో చేపట్టే ప్రతీ అభివృద్ధి పని నాణ్యతా ప్రమాణాలతో ఉండాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం రఘునాథపాలెం మండలం వి.వి.పాలెం గ్రామంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి పర్యటించారు. రూ.97 లక్షల సుడా నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.30 లక్షలతో నూతనంగా నిర్మించిన పశు వైద్యశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఈ గ్రామంతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. 1982లో అప్పటి సీఎం ఎన్టీఆర్‌తో కలిసి తొలిసారిగా ఈ గ్రామానికి వచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. ఇక్కడ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టామని, నాటి నుంచి నేటి వరకు ప్రతి ప్రభుత్వ హయాంలోనూ ఈ గ్రామ ప్రగతికి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నానని చెప్పారు.

పేదల ఇళ్ల నిర్మాణానికి వెంటనే భూమి గుర్తింపు..

వి.వి.పాలెం ​గ్రామంలో నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అత్యంత పేదలకు గృహ స్థలాలు అందించేందుకు అవసరమైన భూమిని తక్షణమే గుర్తించాలన్నారు. అలాగే ప్రభుత్వ భూములపై సమగ్ర సర్వే నిర్వహించాలని ఆర్డీవోను ఆదేశించారు. జిల్లా పశు వైద్యశాల అభివృద్ధికి అవసరమైన అదనపు నిధులను త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో సుడా ఛైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, గ్రంథాలయ ఛైర్మన్ ఖాదర్ బాబా, ఖమ్మం మార్కెట్ కమిటీ ఛైర్మన్ హన్మంతరావు, పంచాయతీరాజ్ ఎస్‌ఈ వెంకట్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి.పురంధర్, వ్యవసాయ శాఖ అధికారి డి.పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>