కలం, వెబ్ డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హృదయవిదారక ఘటన కన్నీళ్లు పెట్టిస్తోంది. చెరువు నిండా చేపలు మృతి చెందడం (Heavy Fish Death) దిగ్భ్రాంతిని గురిచేస్తోంది. మృగశిర కార్తె సందర్భంగా రాష్ట్రంలోని మత్సకారుల సంతోషంగా ఉన్న తరుణంలో ఈ విషాద వార్త ఆందోళనకు గురిచేస్తోంది. జూలూరుపాడు మండలం భోజ్యాతండాలోని దండ్యాల చెరువులో ఎండల తీవ్రతకు సుమారు 10 టన్నుల చేపలు మృతి చెందాయి. నీటి నిల్వలు తగ్గి ఆక్సిజన్ కొరత ఏర్పడటంతోనే చేపలు చనిపోయాయని మత్స్యకారులు చెప్పుకొచ్చారు. చనిపోయిన చేపలు నీటిపై తేలియాడే దృశ్యం కన్నీళ్లను తెప్పిస్తోంది. చెరువునిండా కుప్పలు తెప్పలుగా చేపలు మృతి చెందడాన్ని చూసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘోరమైన దృశ్యాన్ని చూడలేకపోతున్నామని శోకతప్త హృదయాలతో భావోద్వేగంగా స్పందిస్తున్నారు. నెలలుగా చెరువును కన్న తల్లిలా భావించి మత్స సంపదను పెంచి పోషించిన తమకు.. ఈ ఘటన తీవ్ర మనోవేదనకు గురి చేసిందని మత్సకారులు వాపోతున్నారు. చెరువునిండా చనిపోయిన చేపలను చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని బరువెక్కిన గుండెతో దీనంగా ఆవేదన చెందుతున్నారు. దీంతో తమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

