కొత్త బ్లాకులే లక్ష్యం.. సింగరేణికి భట్టి భరోసా

కలం, ఖమ్మం బ్యూరో : రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియలో సింగరేణి సంస్థ చురుగ్గా పాల్గొని మరిన్ని బొగ్గు గనులను దక్కించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆదేశించారు. సింగరేణి (Singareni) సంస్థ ప్రయోజనాలను కాపాడటమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఓపెన్ కాస్ట్ మైనింగ్ ప్రాంతాన్ని శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా సింగరేణి అభివృద్ధి, బొగ్గు ఉత్పత్తి విస్తరణ ప్రణాళికలు, భవిష్యత్ కార్యాచరణపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

పర్యటనలో భాగంగా భట్టి విక్రమార్క స్వయంగా గని లోపలికి వెళ్లి బొగ్గు తవ్వకాలను పరిశీలించారు. తవ్వి తీసిన బొగ్గును చేతిలోకి తీసుకుని దాని నాణ్యతను పరిశీలించిన ఆయన, మణుగూరు గని చరిత్ర, ఉత్పత్తి సామర్థ్యం, బొగ్గు నాణ్యత ప్రమాణాలు, గని జీవితకాలానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ, ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడంతో పాటు బొగ్గు నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని అధికారులకు సూచించారు. సింగరేణి సంస్థను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని తెలిపారు.

ఇటీవల తాడిచెర్ల బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించడంపై సంస్థ ఉద్యోగులు, కార్మికులు ఆనందం వ్యక్తం చేసి సంబరాలు నిర్వహించిన విషయాన్ని అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. అలాగే భవిష్యత్ ఉత్పత్తి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ‘పీకే ఓసీ డిప్ సైడ్ బ్లాక్’ కూడా సింగరేణికి దక్కేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. అధికారుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన భట్టి విక్రమార్క, సింగరేణి ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. సంస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరణ చర్యలు చేపడతామని పేర్కొన్నారు. మణుగూరు గని అభివృద్ధి, సింగరేణి విస్తరణకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>