కలం, వెబ్ డెస్క్: తెలంగాణ వర్షాభావ పరిస్థితులపై రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకొని కరువు మండలాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై మంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రస్తుత వ్యవసాయ పరిస్థితిని అధికారులు మంత్రికి వివరించారు. ఎల్నినో పరిస్థితులు, మద్దతు ధరలపై విస్తృత చర్చించారు.
కరువు పరిస్థితులను గుర్తించేందుకు వర్షపాతం, సాగు విస్తీర్ణం, నేల తేమ, రిజర్వాయర్ నిల్వలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని అంచనా వేయాలని తుమ్మల (Thummala Nageswara Rao) సూచించారు. కరువు తీవ్రతను బహుళ సూచికల ఆధారంగా అంచనా వేయాలన్న తుమ్మల.. అవసరమైన చోట క్షేత్రస్థాయి పరిశీలనలు చేపట్టాలన్నారు.
రైతులకు కేంద్రం అందిస్తున్న మద్దతు ధరపై కూడా తుమ్మల స్పందించారు. మద్దతు ధర ప్రకటించడం, పెంచడంతో కేంద్రం బాధ్యత అయిపోదని చెప్పారు. ఆ ధర ప్రతి రైతుకు అందేలా చూడటం కూడా కేంద్రం బాధ్యతేనని స్పష్టం చేశారు. మద్దతు ధర ప్రకటించిన పంటలన్నింటినీ 100 శాతం మద్దతు ధరకు కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

