కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) నగరంలో అక్రమంగా విక్రయిస్తున్న మేడ్ ఇన్ పాకిస్తాన్ కాస్మోటిక్స్ (Pakistan Cosmetics ) వ్యాపారం బట్టబయలైంది. టాస్క్‌ఫోర్స్ ఇన్చార్జ్ డీసీపీ కేఎస్ రావు నేతృత్వంలో రాజేంద్రనగర్, శంషాబాద్, గోల్కొండ టాస్క్‌ఫోర్స్ బృందాలు హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. ముఖ్యంగా నాంపల్లి ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో ఉన్న కాస్మోటిక్స్ దుకాణాలు, మెడికల్ స్టోర్లలో అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో పలువురు వ్యాపారులు ఎలాంటి చట్టబద్ధమైన లైసెన్సులు లేకుండా వ్యాపారాలు నడుపుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా పలు షాపుల్లో ‘మేడ్ ఇన్ పాకిస్తాన్’ లేబుల్స్ ఉన్న సౌందర్య సాధనాలను విక్రయిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం ఈ దుకాణాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. అధికారులు చాలా వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పలు షాపులు, వ్యక్తులపై కేసులు కూడా నమోదయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.

