కలం, స్పోర్ట్స్ : గ్లాస్గో 2026 (Glasgow 2026) కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games) ప్రారంభానికి ముందే భారత జూడో బృందానికి (India Judo Team) ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ జూడో క్రీడాకారిణి తులికా మాన్‌ను (Tulika Maan) వేర్‌అబౌట్స్ నిబంధనలు పాటించలేదనే ఆరోపణలతో టోర్నీ నుంచి తప్పించారు. అంతకుముందే మరో జూడో ప్లేయర్ అరుణ్ కుమార్ డోపింగ్ పరీక్షలో విఫలమై అర్హత కోల్పోయాడు. జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) నిర్వహించిన అవుట్ ఆఫ్ కాంపిటీషన్ టెస్టులో అరుణ్ కుమార్ విఫలమయ్యాడు. దీంతో అతడిపై చర్యలు తీసుకున్నారు. వరుసగా రెండో రోజు తులికా మాన్ విషయంలో కూడా నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
ఈ వ్యవహారంపై భారత జూడో ఫెడరేషన్ అధ్యక్షుడు ముకేష్ కుమార్ స్పందిస్తూ.. తులికా తన వేర్‌అబౌట్స్ వివరాలను అందించలేదని తెలిపారు. నిబంధనల ప్రకారం ప్రతి అథ్లెట్ తమ వివరాలను నాడాకు సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఈ అంశంపై విచారణ కొనసాగుతోందని, తులికా నాడా అధికారులను కలిసిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు జూడో పోటీలు జరగనున్నాయి. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో తులికా మాన్ రజత పతకం సాధించి భారత్‌కు మెడల్ ఆశగా నిలిచింది.
మరోవైపు అరుణ్ కుమార్ గతంలో మకావు జూనియర్ ఆసియన్ కప్, తైపీ ఆసియన్ ఓపెన్లలో స్వర్ణ పతకాలు సాధించాడు. టాష్కెంట్ గ్రాండ్ స్లామ్లో ఏడో స్థానంలో నిలిచి తొలిసారి కామన్వెల్త్ గేమ్స్‌కు ఎంపికయ్యాడు. యాంటీ డోపింగ్ నిబంధనల ప్రకారం క్రీడాకారులు తమ చిరునామా, అందుబాటు వివరాలను ఎప్పటికప్పుడు అందించాలి. పరీక్షల కోసం ప్రతిరోజూ నిర్ణీత సమయంలో అందుబాటులో ఉండాలి. 12 నెలల్లో మూడుసార్లు నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్షా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఏడాది నుంచి రెండేళ్ల వరకు నిషేధం విధించే అవకాశం ఉంది.

