విద్యతో పాటు విలువలు, జీవన నైపుణ్యాలు నేర్పించాలి.. గురుపూజోత్సవంలో కలెక్టర్ సూచన

కలం, ఆదిలాబాద్ : విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దడంతో పాటు సమాజానికి ఉపయోగపడే ఆదర్శ పౌరులుగా మలచడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ (Adilabad) పట్టణంలోని ఎస్టీయూ భవన్‌లో నిర్వహించిన గురుపూజోత్సవంలో (Teachers’ Day Celebration) జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ వంటి మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ప్రైవేట్ పాఠశాలలు విద్యాభివృద్ధికి విశేష సేవలందిస్తున్నాయని తెలిపారు.

ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 59 వేల మంది, ప్రైవేట్ పాఠశాలల్లో దాదాపు 49 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులకు సమాజంలో వస్తున్న మార్పులపై పూర్తి అవగాహన లేకపోవచ్చని, ఆ లోటును ఉపాధ్యాయులు పూడ్చి విద్యార్థులకు విలువలతో కూడిన విద్య, జీవన నైపుణ్యాలను అందించాలని సూచించారు.

అనంతరం ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉత్తమ సేవలందిస్తున్న ఉపాధ్యాయులను కలెక్టర్‌, ఎస్పీ ప్రశంసా పత్రాలు, మెమంటోలతో సత్కరించి శాలువాలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూషా, జిల్లా విద్యాశాఖ అధికారిణి మాధవి, ట్రాస్మా ప్రతినిధులు పవన్‌రావు, ఆదినాథ్‌, ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>