కలం, వెబ్ డెస్క్ : అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని ఢిల్లీలోని అమెరికా రాయబారి కార్యాలయంలో జరిగిన వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ ద్వారా లైవ్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పై అపారమైన అభిమానం వ్యక్తం చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొన్న ఈ కార్యక్రమంలో ట్రంప్ రాయబారి సెర్జియో గోర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు.
భారీ తెర ముందు నిలబడి ఉన్న రూబియో సమక్షంలో ట్రంప్ మాట్లాడుతూ, ‘నాకు ప్రధాని మోదీ అంటే చాలా ఇష్టం, ఆయన గొప్ప వ్యక్తి, మోదీకి పెద్ద అభిమానిని. నాకు భారత దేశం అంటే ఇష్టం.. ఐ లవ్ ఇండియా’ అని ట్రంప్ కొనియాడారు. భారత్ కు ఏ సహాయం కావాలన్నా నేరుగా ఫోన్ చేయవచ్చన్నారు. అమెరికాలో ఇటీవలి వలస విధాన మార్పుల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ట్రంప్ తన ప్రసంగంలో మార్కో రూబియోను “అమెరికా చరిత్రలోనే గొప్ప విదేశాంగ కార్యదర్శి”గా ప్రశంసించారు. అలాగే రాయబారి సెర్జియో గోర్‌ను కూడా ప్రశంసించి, ఇద్దరూ భారత్‌కు గొప్ప ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ట్రంప్ తరపున సెర్జియో గోర్ ద్వారా ప్రధాని మోదీని వైట్ హౌస్‌కు రావాలని ఆహ్వానించారు.

