కలం, వెబ్ డెస్క్: అమెరికా స్వాతంత్య్ర ప్రకటన వెలువడి 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ‘యూఎస్ నేషనల్ డే’ వేడుకల్లో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (Jaishankar) పాల్గొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో కలిసి ఈ రిసెప్షన్‌లో పాల్గొనడంపై ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా భారత్, అమెరికా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే రెండు పెద్ద రాజకీయ ప్రజాస్వామ్యాలు, బలమైన మార్కెట్ ఆర్థిక వ్యవస్థలు, స్వేచ్ఛాయుత సమాజాలు కలిగిన భారతదేశం, అమెరికాలు ఎన్నో రకాల పరస్పర ప్రయోజనాలను, సమానమైన ఆలోచనలను పంచుకుంటున్నాయని జైశంకర్ పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య ఉన్న అత్యంత పటిష్టమైన వ్యూహాత్మక భాగస్వామ్యం విభిన్న రంగాలలో రోజురోజుకూ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఈ విషయాలను అమెరికా స్వాంత్య్ర వేడుకల సందర్భంగా తాను ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు ఆయన వెల్లడించారు.

