‘టీఆర్ఎస్’ టైటిల్ వార్.. కవిత వర్సెస్ బీఆర్ఎస్

కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాలలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ‘టీఆర్ఎస్’ (TRS) అనే మూడు అక్షరాల పేరుపై రాజకీయ పోరు మొదలైంది. తన పార్టీకి ఈ పేరు దక్కించుకునేందుకు కల్వకుంట్ల కవిత న్యాయపరంగా ముందుకు వెళ్తుండగా.. ఆ పేరును ఆమెకు దక్కకుండా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ‘టీఆర్ఎస్’ టైటిల్ వివాదం (TRS Title War) రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా తెలంగాణ రాజకీయాలలో  ‘టీఆర్ఎస్’ అనే అబ్రివేషన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది.

తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఏర్పడిన ఈ పార్టీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. దీంతో ఈ పేరు కేవలం రాజకీయ గుర్తింపుగానే కాకుండా తెలంగాణ సెంటిమెంట్‌తో ముడిపడిన బ్రాండ్‌గా మారింది. ఈ భావోద్వేగాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలన్న వ్యూహంతోనే కవిత (Kavitha) తన కొత్త పార్టీకి టీఆర్ఎస్ అనే పేరును ప్రస్తావించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్తగా పార్టీ బ్రాండింగ్ చేసుకోవడం కంటే, ప్రజలలో  ఇప్పటికే ఉన్న గుర్తింపు, ఉద్యమ వారసత్వాన్ని ఉపయోగించుకోవడం ద్వారా రాజకీయంగా వేగంగా పుంజుకోవచ్చన్నది ఆమె వ్యూహంగా కనిపిస్తోంది.

తండ్రి వర్సెస్ బిడ్డ

2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి టీఆర్ఎస్‌ను జాతీయ రాజకీయాలలోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో కేసీఆర్ పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చారు. అయితే జాతీయ విస్తరణ ఆశించిన స్థాయిలో ఫలించకపోవడంతో పాటు గత అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ అధికారం కోల్పోయింది. దీంతో పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్‌గా మార్చాలనే డిమాండ్‌లు  పార్టీ శ్రేణుల్లో వినిపించాయి. అయితే బీఆర్ఎస్ నాయకత్వం మాత్రం పేరు మార్పుపై ఆసక్తి లేదని స్పష్టం చేసింది.

ఈ పరిణామాలను కవిత తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో టీఆర్ఎస్ పేరు కోసం జరుగుతున్న పోరు క్రమంగా కవిత, కేసీఆర్ రాజకీయ శిబిరాల మధ్య ఆధిపత్య పోరుగా మారుతోందనే చర్చ జరుగుతోంది.

ఉద్యమ సెంటిమెంట్‌ను రీక్లెయిమ్ చేసే వ్యూహం

తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పేరు ప్రజలలో బలమైన భావోద్వేగాన్ని సృష్టించింది. అదే గుర్తింపును తిరిగి తన రాజకీయ ప్రయాణానికి ఉపయోగించుకోవాలని కవిత ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పార్టీ గత పాలనలో జరిగిన పరిణామాలపై తాను కూడా బాధ్యత వహిస్తున్నానని చెబుతూ, ఉద్యమకారుల అంశాలను ప్రస్తావించడం ద్వారా ఉద్యమ వారసత్వానికి దగ్గరవుతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ టీఆర్ఎస్ పేరు ప్రజలకు సుపరిచితంగా ఉండటం, ఓటర్లలో ఉన్న గుర్తింపు తమకు రాజకీయంగా ఉపయోగపడుతుందని కవిత వర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

‘టీఆర్ఎస్’.. ఒక పేరు కాదు, ఒక బ్రాండ్

తెలంగాణలో ‘టీఆర్ఎస్’ అనే మూడు అక్షరాలు ఒక రాజకీయ బ్రాండ్‌గా మారాయి. ఈ పేరుతో పార్టీ రెండుసార్లు అధికారంలోకి రావడం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంతో అనుబంధం ఏర్పడటం దీనికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. కవిత వర్గం దృష్టిలో ఇది ఉద్యమ వారసత్వానికి ప్రతీక కాగా, బీఆర్ఎస్ వర్గం మాత్రం ఈ పేరు ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్లడం రాజకీయంగా నష్టమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు, కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తర్వాత ఈ వివాదంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ‘టీఆర్ఎస్’ టైటిల్ చివరకు ఎవరి చేతికి వెళ్తుందన్నది తెలంగాణ రాజకీయాలలో  ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>