కలం, వెబ్ డెస్క్: నాగార్జునసాగర్ (Nagarjunasagar) నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ (TRS Party) జెండా గద్దె కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కల్వకుంట్ల కవిత స్థాపించిన టీఆర్ఎస్ పార్టీకి ఇటీవల జెండా గద్దె మోడల్‌ను ఆవిష్కరించారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జెండా గద్దెలను ఏర్పాటు చేశారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని సాగర్ పైలాన్ క్రాస్ రోడ్డు వద్ద కూడా ఒక జెండా గద్దె ఏర్పాటు చేశారు. అయితే నందికొండ మున్సిపల్ అధికారులు ఈ జెండా గద్దెను కూల్చివేశారు. దీంతో స్థానిక టీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు.
అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారని టీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు మున్సిపల్ ఆఫీస్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అదే స్థలంలో ఇతర పార్టీల జెండా గద్దెలు కూడా ఉన్నాయని, వాటన్నింటిని పక్కన పెట్టి కేవలం తమ పార్టీ జెండా గద్దెనే ఎందుకు కూల్చేశారని కమిషనర్‌ను నిలదీశారు. అధికారులు ఒత్తిళ్లకు లొంగిపోయి ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు.

