కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ.. టీఆర్ఎస్ మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా ఇన్‌చార్జి మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్, సాయన్న సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జి.టి.కృష్ణతో కలిసి ప్రజా ఫిర్యాదుల విభాగం (పబ్లిక్ గ్రీవెన్స్)లో మహబూబ్ నగర్ జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం పేరుతో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయకపోవడం, గోనె సంచులు, రవాణా వాహనాల కొరత కారణంగా రైతులు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి రైతులు భారీ నష్టాలను చవిచూస్తున్నారని పేర్కొన్నారు. వర్షాలకు ధాన్యం కోల్పోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలని మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు.

