కలం, కరీంనగర్ బ్యూరో : హుస్నాబాద్(Husnabad) ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై(Pawan Kalyan) తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే నవ నిర్మాణ సభలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ అస్థిత్వం, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా గతంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం మానేశానని చెప్పిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సమయంలో సభలు నిర్వహించడం సరికాదని అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన పవన్ ముందుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజలపై గతంలో చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పకుండా నవ నిర్మాణ సభ పేరుతో రాష్ట్రంలో పర్యటించడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. బీజేపీ అజెండాను అమలు చేయడానికే పవన్ కల్యాణ్ తెలంగాణలో సభలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికారాన్ని ఇచ్చి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించారని, అక్కడి సమస్యలపై దృష్టి పెట్టకుండా తెలంగాణలో సభలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో చేయలేనిది తెలంగాణలో వచ్చి చేస్తానంటే ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి తెలంగాణ బిడ్డ పండుగలా జరుపుకుంటాడని, ఈ వేడుకలలో ఎవరైనా పాల్గొనవచ్చని చెప్పారు. అయితే తెలంగాణను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఇక్కడికి వచ్చి ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే సహించబోమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చని పేర్కొన్న మంత్రి, కానీ విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలను తెలంగాణ ప్రజలు అంగీకరించరని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం పోరాడిన అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలను ఎప్పటికీ మరవలేమని, వారి గౌరవాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.

