కలం, వెబ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీప్రాంతంలో (Maredumilli Forest) వేట ఉచ్చులను తొలగించిన ఫారెస్ట్ అధికారులను అటవీ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభినందించారు. అక్రమ వేటను అరికట్టేందుకు అటవీ సిబ్బంది ఫారెస్ట్‌లోని కంపార్ట్మెంట్ నంబర్ 26/4లో చేపట్టిన ప్రత్యేక పెట్రోలింగ్‌లో భాగంగా 69 వేట ఉచ్చులను గుర్తించి తొలగించారు. వన్యప్రాణులను అక్రమంగా వేటాడేందుకు మూడు చక్రాల వాహనాల బ్రేక్ వైర్లతో ఏర్పాటు చేసిన ఉచ్చులను గుర్తించారు. వాటిని తొలగించి వన్యప్రాణులకు పొంచి ఉన్న ముప్పును నివారించారు.
అడవుల్లో నిరంతర గస్తీ, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తత, సమష్టి కృషి వల్ల అనేక వన్యప్రాణుల ప్రాణాలకు ముప్పు తప్పిందని పవన్ కల్యాణ్ కొనియాడారు. ఈ సందర్హంగా అక్రమ వేట నిరోధానికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కీలక సూచనలు చేశారు. బ్రేక్ వైర్లతో ఉచ్చుల తయారీని నియంత్రించే చర్యల్లో భాగంగా ఆటోమొబైల్ షాపుల యజమానులు, మోటార్ మెకానిక్‌లకు అవగాహన కల్పించాలన్నారు. వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను రక్షించేందుకు అటవీ ప్రాంతాల్లో నిరంతర నిఘా, ప్రత్యేక పెట్రోలింగ్ వంటి చర్యలను మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు.

