కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని టీఆర్ఎస్ చీఫ్ కవిత ( TRS Chief Kavitha) పిలుపునిచ్చారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు సాధన కోసం షాద్‌నగర్‌లోని లక్ష్మీదేవి పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ హయాంలోనూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని విమర్శలు గుప్పించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 33 వేల కోట్లు ఖర్చు చేసినా రైతులకు నీళ్లు ఇవ్వలేకపోయారని మండిపడ్డారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని ఆరోపించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్‌కు 12 సీట్లు ఇచ్చినా అభివృద్ధి పనులు కనిపించలేదని ఫైర్ అయ్యారు. కృష్ణా నది తెలంగాణలో ప్రవహిస్తున్నప్పటికీ ఆ నీళ్లు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తున్నాయన్న ఆమె.. నీటి హక్కుల సాధన కోసం లక్ష్మీదేవిపల్లి వేదికగా మరో ఉద్యమానికి సిద్ధం కావాలని తెలిపారు.
తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకే తెలంగాణ రక్షణ సేన ఏర్పడిందని , త్వరలో మరో నీటి ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు ఆమె వెల్లడించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ప్రకటించాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. అలాగే దసరా లోపు పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ పనులు మొదలు పెట్టాలని.. లేదంటే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పాలమూరు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వ మోసాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం అని హెచ్చరించారు.

