కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సొంత నియోజకవర్గం కొడంగల్‌లో భారీ ఎత్తున కర్ణాటక ఓటర్లు ఉన్నారని, గత ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ రేవంత్ రెడ్డికి సహకరించిదా? అని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సర్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో కవిత మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని సెడం నియోజకవర్గం నుంచి 11 వేల మంది కొడంగల్‌లో ఓటు హక్కు కలిగి ఉన్నారన్నారు. కొడంగల్ లో 22 వేల డూప్లికేట్ ఓట్లు ఉంటే, 11 వేలు కర్ణాటకవేనని చెప్పారు. అయితే సరిగ్గా అంతే మార్జిన్‌తో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో గెలిచారని, అంటే సీఎంకు ఈసీ సహకరించిందా? అని అనుమానం వ్యక్తం చేశారు. కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బులతో పాటు ఓట్లు కూడా ట్రాన్స్ ఫర్ చేశారా? అని కవిత ఎద్దేవా చేశారు.
కొడంగల్‌లో 8 వందలు.. బోధన్‌లో 7 వేలు
బోధన్‌లో ఏడాదిన్నరలో 7 వేల ఓట్లు తీసేస్తే కొడంగల్ లో 8 వందల ఓట్లు మాత్రమే తీసేశారని కవిత వెల్లడించారు. ఎస్ఐఆర్ మీద చాలా అనుమానాలు ఉన్నాయని, అన్నింటిపై ఈసీ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసలు ఇంటర్ స్టేట్ డూప్లికేషన్ ఓట్లను ఏరివేసే మెకనిజం ఈసీ వద్దా ఉందా? అని కవిత ప్రశ్నించారు. అది లేకుంటే 14 వందల కోట్లతో చేపట్టిన ఎస్ఐఆర్ దండగేనన్నారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ ఓట్ అనే విధానం ఉండాలని కవిత సూచించారు. సాధారణంగా ఎస్ఐఆర్‌కు రిఫరెన్స్‌ను ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి తీసుకోవాలన్నారు. కానీ 2025 జనవరి నుంచి ఎస్ఐఆర్‌కు రిఫరెన్స్ పాయింట్ తీసుకుంటున్నారని చెప్పారు.
తొలగించిన ఓట్లపై వివరణ ఏదీ?
బోధన్‌లో పరిస్థితి ఎలా ఉందని తెలుసుకుంటే అక్కడ 7 వేలకు పైగా ఓట్లను తీసివేశారని కవిత అన్నారు. ఆ 7 వేల ఓటర్లు షిప్ట్ అయ్యారా, చనిపోయారా? డూప్లికేషన్ ఓట్లా? అనేది ఈసీ చెప్పడం లేదన్నారు. జనవరి 1, 2025 నుంచి ఇప్పటి వరకు ఏడాదిన్నరలో ఒక్క బోధన్ నియోజకవర్గంలో 7 వేల ఓట్లు డిలీట్ అయినట్లు తెలిపారు. ఈ 7 వేల ఓట్లకు సంబంధించి స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలని ఈసీని కోరారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్‌కు మూడు రాష్ట్రాల్లో ఓటు ఉందని చెబుతున్నారని, ఆ ఓట్లను తొలగించేందుకు ఏడేళ్లు పడితే బోధన్‌లో మాత్రం ఏడాదిన్నరలో 7 వేల ఓట్లు తొలగించారని చెప్పారు. ఒక నియోజకవర్గంలో 2 శాతం కన్నా ఎక్కువ ఓట్లను తొలగించాల్సి వస్తే తొలిగించే ప్రతి ఓటరుకు మూడుసార్లు నోటీసులు ఇవ్వాలని ఈసీ నిబంధన ఉందని గుర్తు చేశారు. కానీ, ఆ విధంగా ఎవరికీ నోటీసు ఇవ్వలేదన్నారు.
కొడంగల్‌లో 11 వేల మంది కర్ణాటక ఓటర్లు
బోధన్‌లో 7 వేల ఓట్లు తొలగించటంతో మిగతా నియోజకవర్గాల్లో అలాగే జరిగిందా అన్న అనుమానంతో కొడంగల్‌లో కూడా చెక్ చేసినట్లు కవిత చెప్పారు. అక్కడ కేవలం 808 ఓట్లు మాత్రమే డిలీట్ చేశారని చెప్పారు. ఒక చోట ఏడు వేల ఓట్లు తొలగించి, కొడంగల్‌లో 8 వందలు మాత్రమే ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. కొడంగల్‌లో దాదాపు 22, 433 డూప్లికేట్ ఓట్లు కూడా ఉన్నాయని కవిత వెల్లడించారు. 2018 లో కొడంగల్ ఉన్న ఓట్ల సంఖ్యతో పోల్చుకుంటే 2023 నాటికి దాదాపు 30 వేల ఓట్లు పెరిగాయన్నారు. కొడంగల్‌కు పక్కనే ఉన్న కర్ణాటకలోని సెడం అనే నియోజకవర్గం నుంచి 11 వేల మంది ఓటర్లు కొడంగల్‌లో ఉన్నారన్నారు.
అక్కడ, ఇక్కడ 11 వేల మంది ఓటర్లు ఎలా ఉంటారని ప్రశ్నించారు. కొడంగల్‌లో ఉన్న డూప్లికేషన్, అదే విధంగా సెడంకు సంబంధించిన 11 వేల ఓట్లు కలిపితే 33 వేల ఓట్లు అవుతున్నాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌లో దాదాపు 33 వేల ఓట్ల మెజార్టీతోనే గెలిచారని, ఈ డూప్లికేట్, అక్రమంగా రిజస్టర్ చేసుకున్న ఓట్లతో గెలుపు, ఓటములు నిర్ణయించబడుతున్నాయని కవిత వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చూస్తే ఎన్నికల సంఘం ముఖ్యమంత్రికి ఏమైనా సహకరించిందేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్రంలోని రెండు నియోజకవర్గాల్లోనే ఇలా ఉంటే మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
కిషన్ రెడ్డికి ప్రశ్నలు
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దేశంలో వేరే దేశంలో వాళ్లకు ఓట్లు ఉండవద్దని అంటున్నారని, దాన్ని పూర్తిగా అంగీకరిస్తామని కవిత అన్నారు. కానీ, ఒక రాష్ట్రంలో ఓటు ఉన్న వాళ్లకు మరొక రాష్ట్రంలో ఉండవచ్చా? అని ప్రశ్నించారు. ఒక రాష్ట్రంలో వేరే దేశ పౌరుడి ఓటు తొలగిస్తే వాళ్లు మరొక రాష్ట్రానికి వచ్చి నమోదు చేసుకోరా? అని నిలదీశారు. అసలు ఇంటర్ స్టేట్ లో ఓట్ల డూప్లికేషన్ ను ఏరివేసేందుకు ఈసీ దగ్గర మెకనిజమే లేదన్నారు. అలాంటప్పుడు 14 వందల కోట్లు పెట్టి ఎస్ఐఆర్ చేయటం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ఈ ఎస్ఐఆర్ ద్వారా దేశంలో డూప్లికేషన్ ఓట్లు ఉండకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించే పరిస్థితి రావాలన్నారు.
సర్ ప్రక్రియకు ముందు దేశంలో ఉండే సంచార జాతుల వాళ్లకు ఏ విధంగా ఓటు హక్కు కల్పిస్తారో సమాధానం చెప్పాలన్నారు. ఒక ఇంట్లో ఉండే వాళ్లందరికీ ఓకే బూత్ లో ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్ఐఆర్ ద్వారా ఇంటర్ స్టేట్ డూప్లికేషన్ ఓట్లను కూడా కట్ చేయాలని, లేదంటే ఎస్ఐఆర్‌కు అర్థం ఉండదని కవిత అన్నారు. ఎస్ఐఆర్ అనేది పర్మినెంట్ సొల్యుషన్‌గా ఉండాలని కోరారు. తమలాంటి కొత్త పార్టీకి ఇది చాలా ముఖ్యమని, ఎన్నికల జాబితాను ఎలాంటి అవకతవకలు లేకుండా సిద్ధం చేయాలని ఈసీ కోరారు.

