కలం, ఖమ్మం బ్యూరో: బతుకుదెరువు కోసం వచ్చిన ఒక అమాయక గిరిజన కుటుంబంపై ఆకతాయిల ముఠా విరుచుకుపడింది. తోడబుట్టిన అన్నల కళ్లముందే వారిని విచక్షణారహితంగా చితకబాది, యువతిని బైక్‌పై అపహరించుకుపోయి సామూహిక అత్యాచారయత్నానికి పాల్పడిన అమానుష ఘటన పాల్వంచ గ్రామీణ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది.
ఒడిషా రాష్ట్రం నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన ఒక గొత్తికోయ కుటుంబం భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా పాల్వంచ (Palwancha) పట్టణంలో నివాసముంటోంది. ఈ క్రమంలో ఈనెల 7వ తేదీన సదరు గొత్తికోయ యువతి కూలీ పనుల కోసం తన అన్నలతో కలిసి నటరాజ్ సెంటర్ సమీపంలో ఉన్న అడ్డా మీదికి వెళ్లింది. ఆ రోజు అడ్డా వద్ద పని దొరక్కపోవడంతో, జీవనోపాధి కోసం పుట్టగొడుగులు సేకరించేందుకు కేటీపీఎస్ సమీపంలోని సూరారం – ప్రశాంత్ కాలనీ మధ్య ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లారు. అదే సమయంలో అక్కడే వెంగళరావు కాలనీకి చెందిన ఆరుగురు యువకులు మద్యం సేవిస్తున్నారు.
పనిలో ఉన్న యువతిని చూసిన ఆ ఆకతాయిలు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధించడం ప్రారంభించారు. చెల్లెలిని కాపాడుకునేందుకు ఆమె సోదరులు అడ్డురాగా, ఆగ్రహంతో ఊగిపోయిన ఆ మృగాలు కర్రలతో వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తీవ్రమైన దెబ్బలకు తాళలేక బాధిత సోదరులు కేకలు వేస్తూ పారిపోగా, మద్యం మత్తులో ఉన్న ఆరుగురు యువకులు సదరు యువతిని బలవంతంగా బైక్‌పై ఎక్కించుకొని కేటీపీఎస్ ఆస్పత్రి సమీపంలోని శిథిలమైన క్వార్టర్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమెను బంధించి అరాచకానికి ఒడిగడుతూ సామూహిక అత్యాచారయత్నం చేశారు.
మరోవైపు రక్తగాయాలతో ఇంటికి చేరుకున్న సోదరులు జరిగిన ఘోరాన్ని చెప్పడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన కేటీపీఎస్ ప్రాంతానికి చేరుకుని వెతకడం ప్రారంభించారు. చుట్టుపక్కల వారిని విచారిస్తూ వెళ్తుండగా, ఒక పాడుబడిన క్వార్టర్ నుంచి యువతి ఆక్రందనలు వినిపించాయి. వెంటనే కుటుంబసభ్యులు అక్కడికి చేరుకోవడంతో భయపడిన నిందితులు బాధితురాలిని వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు.
బాధితులు భయంతో ఈ విషయాన్ని మొదట ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇంటికి వెళ్లిపోయారు. అయితే మరుసటి రోజు దెబ్బలు తిన్న యువకులు యథావిధిగా పనికి రాగా, వారు సరిగ్గా నడవలేకపోవడాన్ని గమనించిన మేస్త్రీ ఆరా తీశారు. అసలు విషయం తెలుసుకున్న ఆయన బాధితులను ధైర్యం చెప్పి పోలీసుల వద్దకు తీసుకెళ్లారు. మేస్త్రీ సాయంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అత్యాచారయత్నానికి పాల్పడిన ఆరుగురు నిందితులను పోలీసులు ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం.

