కలం, వెబ్ డెస్క్: ఖమ్మం జిల్లా గిరిజన విద్యార్థినుల నూతన ఆవిష్కరణకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti) అభినందనలు తెలిపారు. విద్యార్థినులు తయారు చేసిన దోమల నివారణ అగరవత్తులను ప్రభుత్వం తరఫున బ్రాండింగ్ చేసి మార్కెట్లో విక్రయించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
ఖమ్మం జిల్లా వైరా(Wyra) నియోజకవర్గం కొనిజర్ల మండలంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన ఆయన వసతి సౌకర్యాలు, బోధన నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం లైబ్రరీకి వెళ్లి పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు, వనరుల గురించి ఆరా తీశారు.
కళాశాల విద్యార్థినులు దోమల నివారణ కోసం సొంతంగా తయారు చేసిన అగరవత్తుల తయారీ విధానాన్ని డిప్యూటీ సీఎంకు వివరించారు. విద్యార్థినుల సృజనాత్మకతను చూసి ముచ్చటపడిన ఆయన వీటిని ఒక బ్రాండ్‌గా మార్చి మార్కెట్‌లో విక్రయించేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.
అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై విద్యార్థినులకు సందేశాన్ని ఇచ్చారు. తమ ప్రభుత్వం విద్య, వైద్యం, సంక్షేమ రంగాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా తగిన ప్రోత్సాహం అందిస్తామని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క (Bhatti) స్పష్టం చేశారు.
Read Also: విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Follow Us On: Youtube


