వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ట్రీజా-గాయత్రి సంచలనం

కలం, స్పోర్ట్స్: భారత బ్యాడ్మింటన్‌ (Badminton)లో ట్రీజా జాలీ, గాయత్రి గోపీచంద్ జోడీ సరికొత్త చరిత్ర సృష్టించింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో చైనా జోడీ జియా యి ఫాన్, జాంగ్ షు జియాన్‌పై అద్భుత విజయం సాధించింది. దీంతో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత జోడీకి కనీసం కాంస్య పతకం ఖాయమైంది. 69 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో భారత జోడీ 16-21, 21-15, 21-13తో గెలిచింది. తొలి గేమ్‌లో వెనుకబడిన ట్రీజా, గాయత్రి ఆ తర్వాత పుంజుకున్నారు.

రెండో గేమ్ నుంచి దూకుడు పెంచారు. స్మాష్‌లతో చైనా జోడీపై ఒత్తిడి పెంచారు. నెట్ వద్ద కూడా మెరుగ్గా ఆడారు. చివరికి వరుసగా రెండు గేమ్‌లు గెలిచి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్నారు. ఈ విజయం భారత మహిళల డబుల్స్‌కు ప్రత్యేకమైనది. ఈ విభాగంలో భారత్‌కు చివరిసారిగా 2011లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకం వచ్చింది. అప్పుడు జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్ప కాంస్యం సాధించారు. ట్రీజా, గాయత్రి ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో మంచి ఫలితాలు సాధించారు.

2022, 2023లో వరుసగా ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సెమీస్ చేరారు. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యం గెలిచారు. గత ఏడాది ఆరంభంలో ప్రపంచ టాప్-10లోకి ప్రవేశించారు. అయితే ఈ ఏడాది ట్రీజాకు తీవ్ర గాయం కావడంతో వారి ప్రయాణానికి బ్రేక్ పడింది. శిక్షణలో గాయత్రి పాదంపై అనుకోకుండా అడుగు వేయడంతో ట్రీజా చీలమండ మడిచింది. ఎంఆర్‌ఐలో రెండు తీవ్రమైన కండరాల చీలికలు, రెండు లిగమెంట్ చీలికలు బయటపడ్డాయి.

దీంతో ఆమె సుదీర్ఘంగా చికిత్స, పునరావాసం తీసుకోవాల్సి వచ్చింది. ఇండోనేషియా ఓపెన్‌తో ఈ జోడీ మళ్లీ బరిలోకి వచ్చింది. ఆ తర్వాత యూఎస్ ఓపెన్‌లోనూ ఆడింది. ఈ నెలలో ఫిలిప్పీన్స్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ టైటిల్ గెలిచింది. ఇప్పుడు అదే పునరాగమనం ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకంతో మరో స్థాయికి చేరింది. సెమీస్‌లోకి దూసుకెళ్లిన ట్రీజా, గాయత్రి భారత్‌కు మరో పతకం ఖాయం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>